రోడ్ యాక్సిడెంట్ లో ఏడుగురు విద్యార్థులు మృతి!

Monday, June 11th, 2018, 11:24:32 AM IST

ఇటీవల రోడ్ ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోమని చెపుతున్నప్పటికీ రోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ సమీపంలోని లక్నో, ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, బిటిసి చదువుతున్న కొందరు విద్యార్థులు, తమ సహోపాధ్యాయులతో కలిసి హరిద్వార్ కు వెళుతుండగా మార్గ మద్యంలో పక్కన ఇంకొక బస్సు ఆగి ఉండడం చూసి, అందులో పెట్రోల్ అయిపోయిందని తెలుసుకుని, వారిలో కొందరు బస్సు దిగి ఆ బస్సు లో పెట్రోల్ పోస్తున్నారు. అదే సమయంలో ఆ హైవే పై అత్యంత వేగంగా దూసుకొచ్చిన యూపీ రోడ్ వేస్ బస్సు వీరి బస్సును బలంగా ఢీకొట్టింది.

అంతే అలా ఢీకొట్టడంతో ఒక్కసారిగా విద్యార్థుల బస్సు నుజ్జు నుజ్జు అయి, అందులోని ఒక ఉపాధ్యాయుడి సహా ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఆ సమయంలో అవతలి బస్సు కు పెట్రోల్ నిమిత్తం దిగిన కొందరు విద్యార్థులు మాత్రం బ్రతికిపోయారు. ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. వెనువెంటనే అక్కడివారు అంబులెన్సు కు ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న డాక్టర్లు మృతదేహాలను లక్నో ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయమై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చప్పున ఎక్స్ గ్రేషియా, అలానే క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రకటించారు……