91 మార్కులకు బదులు 19 మార్కులు వేశారు!

Wednesday, May 9th, 2018, 03:20:22 PM IST

ఒక విద్యార్థిని పేపర్ కరెక్షన్ సమయంలో చేసిన నిర్లక్ష్యం ఆ విద్యార్థిని కుటుంబం సహా అందరిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే అనంతపురం గుల్జార్ పేట కు చెందిన రామ కిశోర్ కుమార్తె నాగ నవ్య నగరంలోని ఒక కాలేజీ లో ఇంటర్ ఎంఈసి పూర్తి చేసింది. ప్రధమ సంవత్సరంలో ఆమెకు 500 మార్కులకు గాను 483 వచ్చాయి. కాగా మొన్న మార్చ్ లో రెండవ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసింది. అయితే గత నెల 12న రెండవ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి.

అయితే ఆ ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయినట్లు తెలిసింది. ప్రధమ సంవత్సరంలో అంత బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న నవ్య, రెండవ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో నవ్య కుటుంబ సభ్యులు సహా, కాలేజీ యజమాన్యం కూడా దిగ్బ్రాంతికి గురయింది. నిజానికి ఆ ఫలితాల్లో అన్ని సజ్జక్టుల్లో ఆమెకు 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి, కానీ ఒక్క ఎకనామిక్స్ లో మాత్రం 19 మార్కులు రావడంతో తల్లితండ్రులు ఆమెతో రీ కౌంటింగ్ కు అప్లై చేయించారు. కాగా మొన్న మంగళవారం విడుదలైన రీకౌంటింగ్ ఫలితాల్లో ఆమెకు అదే ఎకనామిక్స్ లో 91 మార్కులు వచ్చినట్లు తెలిసింది.

కాగా పేపర్ కరెక్షన్ సమయంలో ఇంటర్ బోర్డు వారు తప్పుగా మార్కులు లెక్కించి వేయడంపట్ల నవ్య కుటుంబ సభ్యులు సహా అందరూ బోర్డు తీరును తప్పుపడుతున్నారు. ఇకనైనా కాస్త జాగ్రత్తగా పేపర్ కరెక్షన్ సమయంలో మార్కులను సరిగా లెక్కించాలని, ఎంతో ఆశతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ విధమైన నిర్లక్ష్యంవల్ల నిరాశకు గురవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు……

Comments