టిడిపికి షాక్, బిజెపిలోకి కేంద్ర మాజీ మంత్రి?

Thursday, May 3rd, 2018, 02:44:15 AM IST

తెలుగు దేశం పార్టీ ప్రాభవం గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గిందని కొన్ని సర్వేలు చెపుతున్నాయి. అయితే వాస్తవానికి ఒకప్పుడు కొన్ని ఏళ్ళ చరిత్రకలిగిన కాంగ్రెస్ ను పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఓడించిన ఘనత టీడీపీది. టీడీపీకి అంటూ కొంత కోటరీ ఉందని, దానిని బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదనేది కొందరి వాదన. ఈ విషయం అటుంచితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆశావహులు తమకు స్థానాల్లో దక్కే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టిడిపి నేత ఎంపీ, మాజీమంత్రి, సుజనా చౌదరి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ జాతీయ పత్రికలో ప్రచురితమైన ఈ వార్త టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. పార్టీలో మంచి పేరున్న సుజనా, పార్టీని వీడితే నష్టం ఎక్కువగానే ఉంటుందని, ఒకవేళ ఆయన బయటకువెళితే ఆయనవెంట మరికొందరు నేతలుకూడా వెళ్లే అవకాశంవుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల టీడీపీ వారు క్రియేట్ చేసిన ‘ఎన్సిబిఎన్’ వాట్సాప్ గ్రూప్ లో ఎమ్యెల్యే లు, ఎంపీ లు సభ్యుల గా వున్న విషయం తెలిసిందే. అయితే ఈ గ్రూప్ లో ఒక నేత సుజనా పార్టీ వీడుతున్నారని పోస్ట్ చేశారట. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్, ప్రస్తుతానికి ఈ విషయమై ఎటువంటి సమాచారం లేదు, విషయం బయటకు రానివ్వండి అప్పుడు చూద్దాం అని అన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఒకప్పుడు ప్రధానికి, ముఖ్యమంత్రికి మధ్య మంచి అనుసంధానకర్త గా వ్యవహరించిన సుజనా, ఆ సమయంలోనే బిజెపి నేతలకు దగ్గరయ్యారని, అందుకే మోడీ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది……

Comments