షాకింగ్ : రూ 6.5 కోట్లు ఇస్తే ఓకే అంటున్న…డేవిడ్ వార్నర్

Friday, April 6th, 2018, 01:13:22 AM IST


బాల్ ట్యాంపింగ్ నేరంతో నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆ వివాదానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకాలం ఈ ఘటనకు సంబంధంచి ఎవరికి తెలియని విషయాలు ఒక మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6.5 కోట్లు చెల్లిస్తే మొత్తం అన్ని విషయాలు బయటపెడతానని సంచలన ప్రకటన చేసాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఓ ప్లాన్ ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ దృశ్యం అక్కడి కెమెరాలకు చిక్కడంతో వార్నర్, స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో వార్నర్ స్పాన్సర్లు కూడా అతనితో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వార్నర్‌కి దాదాపు 6 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీన్ని భర్తీ చేసేందుకు వార్నర్ ఈ మిలియన్ డాలర్ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని డేవిడ్ పెన్‌బర్తీ అనే జర్నలిస్ట్ పేర్కొన్నాడు. ‘‘వార్నర్ తాజాగా మాట్లాడిన మీడియా సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అయితే వార్నర్‌కి ఈ ఘటన వల్ల 6 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీన్ని భర్తీ చేసేందుకు ఓ పథకం ప్రకారం మీడియా ముందు అతను అన్ని విషయాలు చెప్పలేదు.

అయితే ఇప్పుడు తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు నైన్ నెట్‌వర్క్ లేదా సెవన్ నెట్‌వర్క్‌తో వార్నర్ ఆర్థిక ఒప్పందం చేసుకున్నాడు’’ అని ఆతను పేర్కొన్నాడు. వార్నర్ కూడా మీడియా సమావేశం అనంతరం చేసిన ఓ ట్వీట్ కూడా ఈ వార్తకి మరింత బలాన్నిస్తోంది. మీడియా సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఆ విషయం నాకు అర్థమైంది. కొంత సమయం తర్వాత అన్ని ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెబుతా. కానీ దానికి ఓ పద్ధతి ఉంది అని వార్నర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వార్నర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అయితే వార్నర్ ఈ మిలియన్ డాలర్ ఇంటర్వ్యూ లో ఎటువంటి సంచలన విషయాలు బయటపెడతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments