షాకింగ్ న్యూస్ : బాబోయ్ అన్ని వేల ఆత్మహత్యలా??

Monday, March 12th, 2018, 03:07:17 PM IST

రోజురోజుకి చదువు ఒత్తిడి భారం తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యల బాట పడుతున్న ఉదంతాలు అక్కడక్కడా చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం విద్యార్ధులపై స్కూలు, కాలేజీలు రాంక్ ల కోసం వారి పై వత్తిడి తేవడమే అని కొందరి వాదన. సున్నిత మనస్తత్వం గల మరికొందరైతే పదవ తరగతి, ఇంటర్ వంటివి తప్పితే చాలు ఇక జీవితం అయిపోయినట్లే భావించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం కొంతవరకు విద్యావ్యవస్థలో లోపమైతే, మరికొంత తల్లితండ్రుల పెంపకంలో లోపమని మానిసికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే నేడు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తాజా రిపోర్టులు సైతం హెచ్చరిస్తున్నాయి.

తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో 2007 నుంచి 2016 మధ్యకాలంలో దేశంలో దాదాపు 75వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. 2016లోనే దాదాపు 9,474 మంది విద్యార్థులను తమ ప్రాణాలను తీసుకున్నారని, అంటే రోజుకు 26 మంది చనిపోయినట్టు హోం వ్యవహారాల సహాయమంత్రి హెచ్‌జీ అహిర్‌ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు దేశంలో 52 శాతం మేర పెరిగాయని, 2007లో రోజుకు 17 మంది తమ ప్రాణాలను బలిచేసుకుంటే, 2016కి వచ్చేసరికి రోజుకు 26 మంది చనిపోయినట్టు తెలిసింది. 2016లో 1,350 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, దాని తర్వాత పశ్చిమబెంగాల్‌, తమిళనాడులు ఉన్నాయని రిపోర్టు పేర్కొంది.

కొందరు పరీక్షల్లో ఫెయిల్‌ కావడం వల్లనే 2016లో 2,413 మంది విద్యార్థులు చనిపోయారని రిపోర్టులో వెల్లడైంది. ఇదే కారణంతో 2007 నుంచి 2016 మధ్యకాలంలో 23వేల మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిసింది. యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉందని లాన్సెట్‌ రిపోర్టు 2012లోనే హెచ్చరించింది. వీరిలో 15 నుంచి 29 వయసు కలవారు ఎక్కువగా చనిపోతున్నట్టు తెలిపింది. విద్యార్థుల్లో ఈ విధమైన మానసిక ప్రవృత్తికి గల కారణాలు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు గ్రహించి, వారిపై లేనిపోని ఒత్తిడి లేకుండా తగు చర్యలు తీసుకుంటే వీటిని కొంత వరకు అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments