షాకింగ్ న్యూస్ : అమెరికన్ యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆకలి కేకలు  

Thursday, April 12th, 2018, 01:50:19 PM IST

సోషల్ మీడియా ఎంతో పవర్ఫుల్ గా వున్న ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయం బయటకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అగ్ర రాజ్యం అమెరికాకు సంబందించిన ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అది విన్నవారంతా ఇది నిజమా అని అంటున్నారు. కానీ జరిగిన ఘటనలను వింటుంటే నిజమే అని చెప్పక తప్పదు. విషయం లోకి వెళితే, ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా విశ్వ విద్యాలయాల్లో ఏడాది కాలంలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారన్న వార్త ప్రస్తుతం పెద్ద కలకలమే రేపుతోంది. విద్యార్థులు ఉన్నట్లుండి బరువు తగ్గుతున్నారని, అయితే అదేదో డైటింగ్ చేశో, వ్యాయామం చేశో కాదని, ఆహారాన్ని తగ్గించి తీసుకోవటం కారణంగా బరువు తగ్గినట్లు తేలింది. ఎందుకిలా అంటే, కడుపు నిండా తినేందుకు అవసరమైన డబ్బు లేకపోవటం అట. ఇలా ఒకపూట మాత్రమే తింటూ, కడుపు కట్టుకొని చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య విశ్వవిద్యాలయాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోందని, వందలాది మంది విద్యార్థులు తమకు సరిపడా ఆహారాన్ని కొనుగోలు చేయలేని దుర్బరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా తేలింది.

కాగా ఈ సంచలన విషయం ఎలా తేలిందంటే, టెంపుల్ యూనివర్సిటీ విస్ కాన్సిస్ హోప్ ల్యాబ్ ఒక భారీ సర్వేను నిర్వహించింది. అమెరికాలోని 66 విద్యాసంస్థల్లోని 43వేల మంది విద్యార్థుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ సర్వేలో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల్లో 36 శాతం మందికి తగినంత ఆహారం లభించటం లేదని, ఇందుకు కారణం డబ్బు లేకపోవటంగా తేలింది. చేతిలో డబ్బులు ఎక్కువగా లేకపోవటంతో తక్కువ మొత్తంలో ఆహారాన్ని తిని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో 36 శాతం మందికి సరైన నివాస సదుపాయం కూడా లేదని, ఇలాంటి వారు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఉంటున్నట్లు సర్వ్ చెపుతోంది. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, కొంతమంది అయితే పగలంతా క్యాంపస్ లలో తిరిగి, రాత్రి అయ్యేసరికి రైళ్లు, బస్సులు, ఆసుపత్రులు, అంబులెన్స్ ల్లో తలదాచుకుంటున్న వైనం బయటకు వచ్చింది. వసతి సమస్యతో పోలిస్తే, ఆహారం లభించని సమస్య మరింత పెద్దదిగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. అగ్ర రాజ్యంలోని విద్యార్థులు ఆకలి కేకలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయంలోకి వెళితే, విశ్వ విద్యాలయాల్లోనూ, కాలేజీల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

తగినంతగా స్కాలర్ షిప్ లు రాకపోవటం ఓపక్క, మరోపక్క చదువుకుంటూ ఏదో ఒకటి పని చేయటానికి సిద్ధపడినప్పటికీ వారి అవసరాలు తీరటం కష్టమౌవుతోందట. దీంతో, పస్తులు ఉండాల్సి వస్తోందటున్నారు. ఒక విద్యార్థి వసతి, ఆహార ఖర్చు అమెరికాలో సగటున ఏడాదికి కనీసం 10వేల డాలర్లు ఉంటుందని, ఈ ఖర్చు ఏడాదికేడాది అంతకంతకు పెరిగిపోతుందన్నారు. దుస్తులు, లాండ్రీ ఇతర ఖర్చులు దీనికి అదనమని ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నా వారికి ఆదాయ మార్గాలు లేకపోవటంతో ఆకలి బాధలు తప్పటం లేదంటున్నారు. మరో విషయం ఏమిటంటే, తెల్లారింది మొదలు విద్యార్థులు పలువురు తమకు ఉచితంగా భోజనం ఎక్కడైనా దొరుకుతుందేమోనన్న అంశంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, ఆకలి కారణంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. పేరుకు ఆగ్రరాజ్యమే కానీ అక్కడ చదువుకునే విద్యార్థుల ఆకలికేకలు వింటుంటే, ఉన్నంతలో మన పిల్లలే చక్కటి సౌకర్యాలతో చదువుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ఈ సర్వే లో వెల్లడైన నిజాలను విన్న నెటిజన్లు ఔరా అంటూ విస్తుపోతున్నారు…..