షాకింగ్ న్యూస్ : టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ !

Tuesday, March 20th, 2018, 10:28:01 AM IST

ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో మానవుడు టెక్నాలజీ పై అధికంగా ఆధారపడుతున్నాడు. అయితే దానిని మంచి పనులకు ఉపయోగిస్తున్న వారున్నారు. అలానే కొందరు దానిని చెడ్డ పనులకు కూడా వాడుతూ, దుర్వినియోగం చేస్తున్నారు. విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్త అందుతోంది, ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం పదో తరగతి ఇంగ్లీష్‌ పరీక్షకు అరగంట ముందే ఆదిలాబాద్‌, వనపర్తి జిల్లాలలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకైంది. ఓ టీచర్‌ ప్రశ్నాపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫోటో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసినట్లు సమాచారం. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తం అయింది. వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వగా, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

నాలుగు పోలీసు బృందాలు విచారణ జరుపుతున్నాయి. మరోవైపు రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఫోన్‌లో మాట్లాడారు. లీకైన సెంటర్ల సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వెలువరించారు. ఇక ఈ లీకేజీపై ఆదిలాబాద్‌ డీఈవో మాట్లాడుతూ, వాట్సప్‌ ద్వారా క్వశ్చన్‌ పేపర్‌ను లీక్‌ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో టెన్త్‌ ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నలుగురు అధికారులపై వేటు పడింది. ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు సూపర్‌ వైజర్లతో పాటు విద్యార్థులుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు…..