షాకింగ్ న్యూస్ : బట్టలు విప్పించి తనిఖీలు చేసిన విమాయానయాన సంస్థ!

Sunday, April 1st, 2018, 08:54:35 PM IST

మనం జీవిస్తున్న సంఘంలో స్త్రీ కి ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఎన్నో సంస్కృతి సంప్రదాయాల మిళితమైన మన భారత దేశంలో ఆడవాళ్లను గౌరవించడం మన ప్రధమ కర్తవ్యం అనేది అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ రోజు ఎక్కడో ఒకచోట ఆడవారి పట్ల లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జారుతూనే వున్నాయి. అయితే నేడు సభ్యసమాజం తలవంచుకునేలా చేసిన ఒక చర్యకు ఒడిగట్టింది స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది. ఎయిర్‌ హోస్టెస్‌ లు, ఇతర విమాన సిబ్బందిని ఆ సంస్థ అధికారులు తనిఖీలు చేశారు. స్పైస్‌జెట్‌ ఎయిర్‌ హోస్టెస్ లు విమానాల్లో తినుబండారాలు, శీతల పానీయాలను విక్రయించే సమయంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని, విమానంలోని పలు వస్తువులను మూడో కంటికి తెలియకుండా చోరీ చేస్తున్నారని ఆ సంస్థ కొంతకాలంగా అనుమానిస్తోంది.

దీంతో, మార్చి 28 అర్ధరాత్రి నుంచి ఆ సంస్థ సెక్యూరిటీ అధికారులు సిబ్బందికి శల్యపరీక్షలు ప్రారంభించారు. అయితే మరొక సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే మగవారు, ఆడవారు అని చూడకుండా బట్టలిప్పి మరీ తనిఖీ చేశారు. అయితే ఇదెక్కడో మారుమూల ప్రాంతంలోనో, నాగరికతకు దూరంగా ఉన్న అడవుల్లోనో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. శనివారం ఉదయం తనకు జరిగిన అవమానాన్ని చెన్నైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ మీడియాకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు దొంగిలించావా అంటూ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందే ఉన్నా, ఒంటిని తడుముతూ తనిఖీ చేయడం ఇబ్బందిగా ఉంది. అంతలోనే బట్టలిప్పాలంటూ హుకుం జారీ చేశారు. నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేశారు. అదోలా చూస్తేనే, శిక్షపడేలా నిర్భయలాంటి చట్టాలున్నాయి.

మరి, మమ్మల్ని నగ్నంగా నిలబెట్టి తనిఖీ చేసిన వారికి అవి వర్తించవా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై స్పైస్‌జెట్‌ అధికారులు తమ చర్యను సమర్థించుకున్నారు. దొంగతనాలు, స్మగ్లింగ్‌, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకే తనిఖీలు చేపట్టాం అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. జరిగిన ఈ విషయం ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ విషయమై పలువురు నెటిజన్లు స్పైస్ జెట్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….