కెప్టెన్ పోస్ట్ రాగానే రెచ్చిపోయిన శ్రేయాస్!

Saturday, April 28th, 2018, 10:06:18 AM IST

ఐపీఎల్ లో ఈ సారి దాదాపు అన్ని జట్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టే అనిపిస్తున్నా కొన్ని మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ లో అయితే మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు విజయాలను అందుకోవడం విఫలమయ్యింది. అయితే నిన్న కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో జట్టు పుంజుకుంది. ఓటములకు బాధ్యత వహిస్తూ గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ గా ఎంపిక చేయగా మొదటి మ్యాచ్ లోనే అతను తన సత్తా చాటాడు. కేవలం 40 బంతుల్లో మూడు ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

20 ఓవర్లలో ఢిల్లీ జట్టు మొత్తం 219 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (62), కోలిన్ మన్రో (33) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కత్తా ఆటగాళ్లు పుంజుకున్న ప్రతిసారి ఢిల్లీ బౌలర్లు దెబ్బ కొట్టారు. మధ్యలో ఆండ్రూ రస్సెల్(44) కాస్త బయపెట్టినా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో కేకేఆర్ గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ తో ఢిల్లీ జట్టు టోర్నీలో రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది. కేకేఆర్ నాలుగవస్థానంలో కొనసాగుతోంది.