ల‌క్ష కోట్ల‌ వైజాగ్ ల్యాండ్ స్కాం దోషులెవ‌రు ?

Monday, January 22nd, 2018, 03:11:25 PM IST

బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రం గ‌త ఏడాది కాలంగా అట్టుడికిపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా న‌గ‌రం నాలుగు వైపులా ఉన్న భూముల్ని క‌బ్జాస‌ర్పాలు కోర‌లు చాచి మింగేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌డాబాబులెంద‌రో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్యే పీలా గోవింద్ స‌హా ప‌లువురు రెవెన్యూ అధికారుల భాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ఏపీ రోడ్లు-భ‌వ‌నాల శాఖామాత్యులు అయ్య‌న్న పాత్రుడు సాక్షిగా అస‌లు దోషులెవ‌ర‌న్న‌ది బ‌హిర్గ‌త‌మైంది. భూదోపిడీలో గంటా గుట్టు అంతా అయ్య‌న్న చెంత‌నే ఉంది. ఆయ‌న వ‌ద్ద ప‌లు సాక్షాధారాలు ఉన్నాయి. వాటిని సిట్ ద‌ర్యాప్తు అధికారుల‌కు ఇచ్చాడు అయ్య‌న్న‌. అయితే ఈ భూదోపిడీపై గ‌త మూడునాలుగు నెల‌లుగా సిట్ ద‌ర్యాప్తు సాగుతూనే ఉంది. విశాఖ‌లో ప‌లు రెవెన్యూ ఆఫీసుల ప‌రిధిలో మాయ‌మైన భూ ద‌స్త్రాల‌పైనా సిట్ ఆరా తీసింది. మంత్రులు-రెవెన్యూ అధికారులు కుమ్మ‌క్క‌యి ల‌క్ష‌ల కోట్ల ప్ర‌భుత్వ భూముల్ని ఏళ్ల‌కు ఏళ్లుగా ఎలా కైంక‌ర్యం చేశారు? అన్న‌దానిపై అసాధార‌ణ‌మైన ద‌ర్యాప్తు సాగింది. ఎట్ట‌కేల‌కు ఈ ద‌ర్యాప్తులో ఎన్నో నిజాలు నిగ్గు తేలాయ‌ని సిట్ బృందం చెబుతోంది. అంతేకాదు ద‌ర్యాప్తుకు సంబంధించిన విష‌యాల‌న్నిటినీ సీల్డ్ క‌వ‌ర్‌లో లాక్ చేసి దానిని సంబంధిత అధికారుల‌కు, ప్ర‌భుత్వానికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. మొన్న సంక్రాంతి వేళ అంతా సెల‌వుల్లో ఉండ‌డంతో వాటిని ఓ సీక్రెట్ గ‌దిలో దాచామ‌ని తెలిపారు.

అయితే అస‌లు మ‌త‌ల‌బు ఇక్క‌డే ఉంది. ఆ సీక్రెట్ గ‌దిలోనైనా ఈ దర్యాప్తు చిట్టా సేఫ్‌గా ఉందా? లేదా? అన్న సందేహాలు ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతున్నాయి. లేదూ ఈ ద‌ర్యాప్తు పార‌ద‌ర్శ‌కంగానే సాగితే అస‌లు దొంగ‌ల పేర్లు ఏవైనా బ‌య‌టికి వ‌స్తాయా? అన్న‌ది చూడాలి. అయితే ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ పెద్ద త‌ల‌కాయ‌ల్ని కాపాడేందుకు చిన్న చేప‌ల్ని ఎర‌వేసి వాళ్ల‌కు శిక్ష‌ప‌డేలా చేసి త‌ప్పించుకునేందుకు దారి చూపించారా? అన్న‌ది కూడా తేల‌నుంది. ఇక‌పోతే దీనిని ఏపీ ప్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కూ బ‌హిరంగంగా ప్ర‌జ‌ల‌కు చెబుతుందో కూడా చూడాలి. అయితే సిట్ ద‌ర్యాప్తు వివ‌రాల్ని వెల్ల‌డించ‌డంలో వైజాగ్ మీడియా అల‌స‌త్వం కూడా ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కొచ్చింది. అక్క‌డ కొన్ని వేల‌-ల‌క్ష‌ల కోట్ల భూదోపిడీ సాగుతున్నా విశాఖ లోక‌ల్ మీడియా త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు మిన్న‌కుంది. అంతేకాదు.. స‌రైన ఆధారాల‌తో పెద్ద చేప‌ల్ని బ‌హిర్గ‌తం చేయ‌డంలో మీడియా వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. పీఆర్ బేస్డ్ మీడియాగా ముద్ర‌ప‌డిన విశాఖ మీడియా ఈ విష‌యంలో స‌రైన ప్రూఫ్‌ల‌తో ఎటాక్ చేయ‌డంలోనూ విఫ‌ల‌మైంది. సిట్ ద‌ర్యాప్తులో కూలంకుశ‌మైన విష‌యాల్ని మీడియా బ‌హిర్గ‌తం చేయ‌డంలోనూ విఫ‌ల‌మైన వైనం బ‌య‌ట‌ప‌డింది. చూద్దాం.. మ‌రికొద్ది రోజుల్లో ల‌క్ష‌ల కోట్ల భూదోపిడీ ప‌థ‌కాల‌పై సిట్ ఏం సినిమా చూపించ‌బోతోందో?