స్మార్ట్ ఫోన్ డ్రగ్స్ రెండు ఒకటే ఎలానో తెలుసా..?

Friday, April 13th, 2018, 02:19:11 AM IST

స్మార్ట్‌ఫోన్… ఇప్పుడు మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది. ముఖ్యంగా యువత దానికి పూర్తిగా బానిసైపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లాంటి సోషల్ మీడియా కారణంగా స్మార్ట్‌ఫోన్ వాడకం మరింత పెరిగింది. రోజులో చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌తో గడిపే పరిస్థితి కనిపిస్తున్నది. జన సమూహంలో ఉన్నా.. పక్కనున్న వ్యక్తి కన్నా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయ్యే వారే ఎక్కువయ్యారు. అయితే స్మార్ట్‌ఫోన్‌కు దాసోహమవడం డ్రగ్స్‌కు బానిస కావడంలాంటిదేనని సైంటిస్టులు తేల్చారు. వీటికి బానిసలైపోయినవాళ్లు ఒంటరిగా, తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటారని తాజా అధ్యయనం చెబుతున్నది. స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం అంటే డ్రగ్స్ వాడకంలాంటిదే అని న్యూరో రెగ్యులేషన్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేసిన అధ్యయనంలో రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.

డ్రగ్స్ వాడేవారి మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయో అలాగే స్మార్ట్‌ఫోన్ వాడకం మొదలైన కొత్తలో ఉంటుందని ఈ అధ్యయన బృందంలో సభ్యుడైన శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎరిక్ పెపెర్ చెప్పారు. 135 మంది విద్యార్థులతో ఈ అధ్యయనం జరిపారు. వీళ్లలో స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడే విద్యార్థులు ఒంటరిగా, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించారు. ఈ విద్యార్థులే ఒకేసారి వివిధ పనులు చేస్తున్నట్లు కూడా అధ్యయనంలో భాగంగా తేలింది. అంటే ఒకే సమయంలో చదవడం, టీవీ చూడటం, తినడంలాంటి పనులు చేస్తున్నారు.

అయితే దీనివల్ల మెదడు, శరీరం రిలాక్సవడానికి సమయం దొరకక అన్ని పనులూ అసంపూర్తిగా ఉంటున్నట్లు గుర్తించారు. అయితే మనల్ని మనం స్మార్ట్‌ఫోన్‌కు బానిస కాకుండా నియంత్రించుకోవడం కూడా సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎలాగైతే తక్కువ మోతాదులో చక్కెర తింటారో.. అలాగే మెల్లగా స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పుష్ నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయడం వల్ల చాలా వరకు స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గిపోతుందని చెబుతున్నారు.