బీజేపీతో స్త్రీ సాధికారత ఒక కలగానే మిగిలిపోతుంది !

Wednesday, October 24th, 2018, 02:00:29 AM IST

శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పివ్వగా దాన్ని హక్కుగా భావించిన చాలా మంది మహిళలు శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ అక్కడి భక్తులు మాత్రం వారిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఎంతలా అంటే అక్కడి పోలీసు వ్యవస్థ సైతం అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పును ఒక్క శాతం కూడ అమలుచేయలేకపోయింది. నిరసన చేస్తున్న నిరసనకారుల వెనుక ఉన్న రాజకేయా శక్తుల్లో బీజేపీ ప్రధానమైనది.

స్త్రీ సాధికారత గురించి మాట్లాడుతూ, భేటీ బచావో భేటీ పడావో వంటి పథకాలు వాటికి నిదర్శనమని డబ్బా కొట్టే బీజేపీయే ఇలా స్త్రీ సమానత్వ హక్కుకు సంబందించిన సుప్రీం తీర్పును లెక్కచేయకపోవడం ఆ పార్టీ ఛాందస వ్యవహారానికి నిదర్శనం. మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాలు కూడ మారాలనే గమన సూత్రాన్ని పట్టించుకోని బీజేపీ నేతలు చాలా మంది శబరిమలలో స్త్రీల ప్రవేశానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

తాజాగా బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ నేను ప్రభుత్వంలో ఉన్నానని, దీనిపై కామెంట్స్ చేయడం సరికాదని అంటూనే పరోక్షంగా రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్‌కిన్లను కనీసం స్నేహితుల ఇళ్లకు కూడ తీసుకెళ్ళం.. అలాంటిది వాటిని దేవుడి గుడిలోకి ఎలా తీసుకెళతాం. హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సరికాదు. ముంబైలోని ఫైర్ టెంపుల్లోకి ప్రవేశించే హక్కు మహిళనైన నాకు లేదు. కానీ నా కొడుకు అందులోకి వెళితే అతని కోసం గుడి బయట ఎదురుచూస్తాను అంటూ అర్థంలేని స్టేట్మెంట్ ఇచ్చి సుప్రీం కోర్టు తీర్పు తన దృష్టిలో తప్పన్నట్టు మాట్లాడారు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే స్త్రీ సాధికారిత పట్ల ఇంత సంకుచిత భావంతో వ్యవహరిస్తే దేశంలో స్త్రీలు అన్ని అంశాల్లో సమాన హక్కుల్ని సాధించడం కలలో మాటే.