కేసీఆర్ పాలనలో సామజిక న్యాయం కొరవడింది : టిటిడిపి నేత

Thursday, May 24th, 2018, 04:50:58 PM IST

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టడం చూడలేక ఆనాడు తెలుగు వారి కోసం ఒక పార్టీ కావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఆనాడు తెలుగు దేశం పార్టీని స్థాపించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ తెలుగు దేశం పార్టీ వారి సంక్షేమాన్ని తప్పక పట్టించుకుంటుందని అన్నారు. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ, ఇప్పటివరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియొజకవర్గాల్లో మినీ మహానాడు జరిపి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడం జరిగిందని, ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని చెప్పారు. ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రజలే అసలు న్యాయ నిర్ణేతలని, వారి సంక్షేమం, అభివృద్ధి ప్రకారమే పాలకులు నడుచుకోవాలని అన్నారు.

కానీ కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని, ఆయన అధికారం చేపట్టాక మహిళల పై దాడులు, ధన దోపిడీ పెరగడం, అసాంఘిక శక్తుల ఆగడాలు మరింత శృతిమించడం, ముఖ్యంగా అందరికి సమానంగా జరుగవలసిన సామజిక న్యాయం పూర్తిగా జరుగకుండా పోతోందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి, ఎప్పటికి తెలంగాణాలో టీడీపీకి ఎదురు లేదని, ప్రస్తుతం కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో వున్న నేతల్లో చాలామంది తమ పార్టీలో వుండి పేరున్న నేతలుగా ఎదిగి ఆయా పార్టీల్లోకి వెళ్లినవారేనని గుర్తు చేసారు. మహిళలకు తన క్యాబినెట్ లో అవకాశం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని, దీన్ని బట్టి చూస్తే ఆయన మహిళలకు ఏ మాత్రం న్యాయం చేస్తున్నారో అర్ధం అవుతోందని విమర్శించారు.

కాగా రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు పక్క ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను, దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్తామని, ఒకవేళ మేము అధికారం లోకివస్తే చేపట్టే సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహనా కల్పించి, ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో మెజారిటీ ప్రజల ఓట్లు పొందడమే తమ ముందున్న లక్ష్యమని, రానున్న రోజుల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతాయి అనడానికి మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలే నిదర్శనమని ఆయన అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు విచ్చేసి కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు విస్తృతంగా పర్యటనలు చేపడతారని రమణ అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments