పుష్కర పాపాన్ని జనం మీద, మీడియా మీద తోసేశారు !

Thursday, September 20th, 2018, 10:27:20 AM IST

గత గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 21మంది మృత్యువాత పడగా 50 మందికి పైగా గాయపడిన సంఘటన తెలిసిందే. ఈ దుర్ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవగా ప్రభుత్వం ప్రమాదం వెనుక కారణాల్ని తెలుసుకోవడానికి సి.వై.సోమయాజులు నేతృత్వంలో కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ ఇచ్చిన నివేదికను నిన్న ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. ఈ నివేదికలో ప్రమాదంలో ప్రభుత్వం తప్పేమీ లేదని పేర్కొన్నారు కమీషన్ సభ్యులు.

అంతేకాదు పాపం మొత్తాన్ని భాదిత ప్రజల మీదకు, మీడియా మీదకు తోసేసింది కమీషన్. పుష్కరాలకు కొన్ని నెలల ముందు నుండే మీడియా లేనిపోని ఆశ్చర్యకరమైన వార్తలతో ప్రచారం నిర్వహించడం మూలానే జనాలు వెర్రెత్తినట్టు పుష్కరాలని వచ్చి తొక్కిసలాటలో చనిపోయారని, ఇందు మూలంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతి ప్రచారం చేసిన మీడియా కాగా, రెండవ కారణం ప్రజలేనని కమీషన్ తేల్చింది.

ఈ నివేదికను చూస్తే ప్రభుత్వం దగ్గురుండి తయారుచేయించినట్టే ఉంది తప్ప ఎక్కడా వాస్తవాలను వెలికితీసే ఉద్దేశ్యంతో చేసినట్టు లేదు. ఒకవేళ మీడియా అతి ప్రచారం చేసిందనే అనుకున్నా ఒక భారీ కార్యాన్ని చేపట్టేటప్పుడు ప్రభుత్వం ఎంతమంది జనం హాజరవుతారు, అందరికీ సౌకర్యాలను ఎలా కల్పించాలి వంటి అంచనాల్ని ముందే వేసుకుని అదనపు జాగ్రత్తలు కూడ తీసుకోవాలి. కానీ మన ప్రభుత్వం అలాంటివేమీ చేయకుండా పుష్కరాల ద్వారా ప్రజల్లో ఇమేజ్ ను పెంచుకోవాలని ట్రై చేసింది. నిధుల్ని అనవసరమైన హంగులు ఖర్చగు చేసింది. పరిమితికి మించి జనాలని పుష్కరాలను అనుమతించి, తగినంతమంది నియంత్రణ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యంతో వ్యవహరించి 21మంది చావుకు కారణమైంది. కమీషన్ నివేదిక ఎలా ఉన్నా.. ఇదే నిజం.