కూటమి లో కొన్ని సీట్లు…

Thursday, November 8th, 2018, 11:00:26 PM IST

రానున్న ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఏర్పాటు చేసుకున్న కూటమి లో అధిక సీట్లు కాంగ్రెస్ సొంతం చేసుకోగా మిగతావి కూటమి లోని పార్టీల వాళ్ళకి పంచేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 93 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దిల్లీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం 74 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్ల విషయంపై కాంగ్రెస్‌ ఓ స్పష్టతనిచ్చింది. సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ అంశంపై కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా మీడియాతో మాట్లాడారు. మహా కూటమిలో మిత్రపక్షాలకు 26 సీట్లు కేటాయించినట్టు చెప్పారు.

తెదేపాకు 14, తెజస 8, సీపీఐకి 3, మరో పార్టీకి ఒక స్థానం చొప్పున సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ 74 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని వెల్లడించారు. ఈ నెల 10న తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఆయన స్పష్టంచేశారు. మిగిలిన 20 సీట్లపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమయాన్ని బట్టి ఈనెల 11, 12 తేదీల్లో చర్చించి వెల్లడిస్తామని కుంతియా తెలిపారు. మరోవైపు, అభ్యర్థుల జాబితాపై గత మూడు రోజులుగా కసరత్తు చేసి పీటముడి ఉన్న స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్‌ కమిటీ అందజేసిన జాబితాను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ నిశితంగా పరిశీలించింది. సోనియా గాంధీ నేతృత్వంలో చర్చించి 74 మంది అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది.

అలాగే మిత్రపక్షాలకు కేటాయించాల్సిన సీట్ల సర్దుబాటును కూడా ఖరారు చేయడంతో గత కొంతకాలంగా పొత్తుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్టయింది. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ తాము పోటీచేసే 93 స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు 74 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టు కుంతియా ప్రకటించారు. 74 మంది అభ్యర్థులపై ఏకాభిప్రాయాని వచ్చిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఆ జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కి అందజేసినట్లు సమాచారం. మహాకూటమిలోని పార్టీల నేతలతో కలిసి ఈ జాబితాను ఈ నెల 10న ఉదయం 11గంటలకు విడుదల చేసేందుకు ఉత్తమ్‌ సిద్ధమవుతున్నారు.