టిడిపి పై సోము వీర్రాజు ఫైర్ !

Saturday, February 3rd, 2018, 10:22:11 PM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికార, మిత్రపక్షాలయిన టీడీపీ మరియు బిజెపి లు ఉప్పు నిప్పు వలే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రక్క కేంద్ర బడ్జెట్ లో రాష్త్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని టిడిపి నేతలు చెపుతుంటే, అవన్నీ తప్పు, కేంద్రం ఎప్పుడు ఆంధ్రకు న్యాయమే చేస్తుంది మోడీ తాను ఇచ్చిన మాట నిలుపుకుంటారు, అయినా ఇప్పటివరకు ఎంతో కొంత కేంద్ర సాయంతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తులో కూడా బిజెపి ఆంధ్రకు అన్ని విధాలా అండగా ఉంటుందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. సీనియర్ నేత, ఏపీ శాసనమండలి లో బీజేపీ తరపున ఎంఎల్సి గా వున్న సోము వీర్రాజు, విశాఖ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజులు మాత్రం టిడిపి నేతల పై తమ డైన శైలిలో విమర్శలు గుప్పించడం చూస్తున్నాం. బడ్జెట్ పై సోము వీర్రాజు మాట్లాడుతూ బిజెపి ది పేదల ప్రభుత్వమని, మోడీ పేదల పక్షపాతి అన్నారు. బడ్జెట్ పై విమర్శిస్తున్న టిడిపి నేతల పై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేశ్ రాయపాటి సాంబశివరావులు విమర్శలు గుప్పించడాన్ని వీర్రాజు తప్పుబట్టారు. అయినా వ్యాపారాలు చేసుకునే రాయపాటి, టిజి వెంకటేష్ వంటి ఎంపీ లకు పేదల పెన్నిధి అయిన మోడీ గురించి, బిజెపి గురించి మాట్లాడే హక్కులేదని, వారు ఎంటువంటి వ్యాపారవేత్తలో అందరికి తెలుసన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు మొత్తం ప్రాజెక్టు పనులను కేంద్రానికే అప్పగిస్తామని చెప్పిన మాటను ఆయన ప్రస్తావించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులతో ఏ మాత్రం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజక్టు విషయమై మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఇప్పటిదాకా 19 అవార్డులు వచ్చాయని చెప్పిన వీర్రాజు, ఆ అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా? అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ మద్దతుతో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారని, తద్వారా ఇద్దరు వ్యక్తులను ప్రధాన మంత్రులను చేశారని, ఇప్పుడు మళ్లి రాయపాటి, టిజి వెంకటేష్ లు అదే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎత్తుగడలు వేస్తున్నారని, అయినా అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం టీడీపీకి ఆ పార్టీ నేతలకు సరికాదని కూడా ఆయన సూచించారు. కేంద్ర బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి, అంతేకాని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు….