పోలీసన్న నీకు మొక్కాలే..!

Tuesday, April 3rd, 2018, 07:54:25 PM IST

కన్న కొడుకులు ఆ తల్లిని పట్టించుకోలేదు. రోడ్డు పక్కన విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆకలికి అలమటిస్తూ ఆ తల్లి అలాగే రోడ్డు పక్కన పడి ఉంది. అయితే లోకం ఏమీ గొడ్డు పోలేదు, నీకు నేనున్నానంటూ ఓ పోలీస్ హోం గార్డు ఆమె పట్ల ఉదాత్తతను ప్రదర్శించాడు. ఆ తల్లికి ఆహారం అందించి ఆమెను వృద్ధాశ్రమానికి తరలించేందుకు సహకరించాడు. దీంతో ఇప్పుడా హోం గార్డు నెటిజన్ల అభిమానాన్ని చూరగొంటున్నాడు. వివరాల్లోకి వెళితే…

నగరంలోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ దగ్గర రహదారి పక్కనే ఉన్న ఓ టీస్టాల్ వద్ద ఓ వృద్ధురాలు గత 3 రోజులుగా పడి ఉంది. ఎంతో మంది ఆ దారి గుండా వెళ్లినప్పటికీ ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదు. కన్న కొడుకులు ఆమెను అక్కడ వదిలిపెట్టి వెళ్లడంతో ఆమెకు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ టీస్టాల్ వద్దే ఉంది. ఈ క్రమంలో నిన్న ఆమెను గమనించిన కూకట్‌పల్లి ట్రాఫిక్ పీఎస్ హోం గార్డు బి.గోపాల్ ఆ వృద్ధురాలికి ఒక కప్పు టీతోపాటు ఆహారాన్ని స్వయంగా కొని తినిపించాడు.

ఆ వృద్ధురాలు కనీసం తన చేతుల్తో తాను స్వయంగా ఆహారం తినలేని స్థితిలో ఉండడంతో గోపాల్ ఆమెకు టీ తాగించి ఆహారం తినిపించాడు. అనంతరం ఆమెను వృద్ధాశ్రమానికి తరలించడంలోనూ సహకారం అందించాడు. కాగా ఈ విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సదరు హోం గార్డు గోపాల్‌ను అందరూ అభినందిస్తున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌లు గోపాల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

  •  
  •  
  •  
  •  

Comments