ఉలిక్కిప‌డ్డ క్రికెట్‌.. స్టార్ క్రికెట‌ర్ స్మ‌గ్లింగ్‌

Friday, November 23rd, 2018, 09:31:43 AM IST

క్రికెట్ ప్ర‌పంచం ఉలిక్కిప‌డే సంఘ‌ట‌న ఇది. 15 ఓవ‌ర్ల స‌మ‌యంలో 30 యార్డ్స్ స‌ర్కిల్‌లో బౌండ‌రీలు దంచుతూ క్రికెట్ ప్ర‌పంచానికి ఈ ఓవ‌ర్ల‌లో దూకుడుగా ఎలా ఆడాలో ప‌రిచ‌యం చేసిన స్టార్ ఆట‌గాడు స‌న‌త్ జ‌య‌సూర్య‌. ఎడ‌మ‌చేతి వాటం బ్యాటింగ్‌తో ప్ర‌త్యర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన ఈ శ్రీ‌లంక‌న్ క్రికెట‌ర్ క్రీడా ప్ర‌పంచం నివ్వెర‌పోయే ప‌నిచేశాడు. తాజాగా ఆయ‌న స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు వార్త‌ల్లో నిల‌వ‌డం క్రికెట్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `దైనిక్ భాస్క‌ర్` ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం కోట్ల విలువ‌చేసే ముడి వ‌క్క ప‌లుకుల అక్ర‌మ ర‌వాణాను ఇంట‌లిజెన్స్ అధికారులు ఇటీవ‌ల నాగ్‌పూర్‌లో త‌నిఖీ చేయ‌గా షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ్గొడుతూ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న కేసులో శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం స‌న‌త్ జ‌య‌సూర్య‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ప్ర‌ముఖులు వున్నట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేల‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో జ‌య‌సూర్య‌ను విచార‌ణ కోసం పోలీసులు ముంబైకి పిలిచిన‌ట్లు చెబుతున్నారు. మిగ‌తా క్రికెట‌ర్లు కూడా వ‌చ్చే వారం విచార‌ణ‌కు హాజ‌రు కానున్నార‌ట‌. వ‌క్క ప‌లుకుల‌ని ఇండోనేషియా నుంచి శ్రీ‌లంక‌కు తీసుకొచ్చిన త‌రువాత అందులోని నాసిర‌కానికి చెందిన వ‌క్క‌ప‌లుకుల‌ను ఇండియాకు చెందిన ఓ వ్యాపార వేత్త‌కు భారీ మొత్తంలో జ‌య‌సూర్య అండ్ కో విక్ర‌యిస్తున్న‌ట్లు తేలిన‌ట్లు దైనిక్ భాస్క‌ర‌న్ వెల్ల‌డించింది. వ‌క్క ప‌లుకులు శ్రీ‌లంక‌లోనే ఉత్ప‌త్తి అయిన‌ట్లుగా జ‌య‌సూర్య న‌కిలీ ప‌త్రాలు సృష్టించి భార‌త్‌లో విక్ర‌యించి వివాదంలో చిక్కుకోవ‌డం విస్మ‌యానికి గురిచేస్తోంది.