పతనం దిశగా మన రాష్ట్రం

Friday, July 5th, 2013, 11:10:38 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దుస్తితి ఇది వరకూ ఎప్పుడూ లేదు. 2009లో కొన్ని అనుకోని సంఘటనల వల్ల అప్పటి ముఖ్యమంత్రి చనిపోవడంతో అదే సంవత్సరం రాజకీయాల్లో తీసుకున్న కొన్ని చేతకాని నిర్ణయాల వల్ల రాష్ట్ర రాజకీయాలకి జబ్బు చేసింది. అప్పటి నుండి రాష్ట్రం ప్రతి డెవలప్ మెంట్ లోనూ వెనక్కే వెళుతోంది తప్ప ముందుకు వెళ్ళటం లేదు. 2013 సెకండాఫ్ ప్రారంభమయినప్పటికీ మన ఆంధ్ర ప్రదేశ్ మాత్రం తనకి తానుగా ప్రాంతీయ రాజకీయాల ఊబిలో చిక్కుకుంటోంది. ఈ వారం జరిగిన సంఘటనలను చూస్తుకుంటే మన రాజకీయాలు కాస్త మెరుగుపడటం సంగతి ఎటు ఉన్నా ఇంకా దిగాజారిపోతున్నాయి అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజల పరిస్థితి మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడిందని చెప్పవచ్చు. ఒక వైపు తక్కువగా ఉండాల్సిన ధరలు, నిరుద్యోగం, విద్యుత్ కోతలు, టాక్స్ లు బాగా ఎక్కువయ్యాయి. మరో వైపు ఎక్కువగా ఉండాల్సిన.. పెట్టుబడి దారుల నమ్మకం, మంచి పరిపాలన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, రాజకీయ విశ్వసనీయతలు మాత్రం బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మన ప్రభుత్వం దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు సబ్సిడీల రూపంలో చాలా లిమిట్ గా ప్రజలకు అందిస్తున్నారు.

కొద్ది సంవత్సరాల క్రితం ఆంధ్రాని ‘అన్నపూర్ణ’ అని పిలిచే వారు. కానీ గోదావరి డెల్టాలో పంటలు పండించే రైతులు గత మూడు సంవత్సరాల్లో రెండు సార్లు ఏడాదిలో వేసే రెండవ పంటని పండించడం ఆపేశారు. గత దశాబ్ద కాలంగా యూనివర్సిటీలలో మొదటి స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ నిలిచింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే అదొక యుద్ద ప్రాంగణంలా మారింది. కొన్ని వేలమంది స్టూడెంట్స్ రాష్ట్రాన్ని విభజించాలనే వాదంతో విజ్రుంభిస్తున్నారు. పొలిటికల్ పార్టీల చేతుల్లో యువకుల జీవితాలు చితికి పోతున్నాయి.

రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. మన నాయకులు కూడా తమ కోర్కెలను తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి అక్కడి పొలిటికల్ పవర్ కలిగిన దేవుళ్ళని దర్శనం చేసుకొని వస్తుంటారు. ఇలా హస్తినకి వెళ్లి వస్తున్న నేతలను ఎన్నుకున్న నియోజక వర్గం పతనమైపోతున్నా పట్టించుకోరు. కానీ ప్రభుత్వం వారిని నిరోధించకుండా సెంట్రల్లో మినిస్టర్ లెవల్లో బర్త్ ల కోసం ఎదురు చూస్తోంది. కానీ వీరంతా తూచా తప్పకుండా చాన్స్ దొరికినప్పుడల్లా ఎవరికి చాన్స్ దొరికితే వాళ్ళు వ్యతిరేఖ పార్టీలో ఉన్న నేతలకు మాత్రం కౌంటర్లు వేస్తున్నారు.

చెవిటి వాడి ముందు శంఖం ఊడినట్టు మన నేతలు కూడా ప్రజల కష్టాలని పట్టించుకోవడం లేదు. ఇక పొలిటికల్ వార్తలని మరో స్టేజ్ కి తీసుకెళ్ళిన వాటి గురించి మాట్లాడితే.. మన టీవీ చానల్స్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వేసిన న్యూస్ నే మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటుంది. దీనివల్ల అధికంగా ప్రచారం దొరుకుతుంది కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రాజకీయ పక్షవాత జబ్బు ఇలానే కొనసాగితే మనమే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతానికైతే 2014 ఎలక్షన్ వరకు మనం నోటిమీద వేలువేసుకొని జరిగేది చూడాలి. ఈ లోపు మన పొలిటికల్ మాస్టర్స్ రాష్ట్రాన్ని ఇంకాస్త దిగాజార్చడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు.

గమనిక : మా బ్లాగులో రాసిన ఈ ఆర్టికల్ లో పొందుపరిచిన సమాచారం కేవలం రచయిత యొక్క అభిప్రాయం మాత్రమే, దీనికి నేటిఏపి.కామ్ కి ఎలాంటి సంబందం లేదు.

ఈ స్పెషల్ కథనాన్ని మీకందించింది – ప్రమోద్.