పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్ధి గుండెపోటుతో మృతి

Saturday, May 12th, 2018, 01:15:27 PM IST

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో పరీక్షకు అనుమతించకపోవడంతో ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. రామకృష్ణ కాలేజీలో మోహన్‌లాల్ అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కింద రూ. 25,700లు యాజమాన్యానికి చెల్లించాడు. మరో రూ. 300లు చెల్లించలేదు. దీంతో సదరు విద్యార్థిని కళాశాల యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. పరీక్షకు అనుమతించకపోతే విద్యా సంవత్సరాన్ని నష్టపోతానని మోహన్‌లాల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థులు కలిసి కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments