అమీర్ పేటలో ట్రంప్ అడుగు..బిటెక్ బాబుల ఆశలు గల్లంతు..!!

Tuesday, October 17th, 2017, 06:18:15 PM IST

బిటెక్ పూర్తి కాగానే ఎక్కువ మంది విద్యార్థుల ఆలోచన ఒకటే. అమీర్ పేట వెల్ళడం.. ఎదో ఒక ఐటి కోర్సు నేర్చుకోవడం..ఉద్యోగం సాధించి అమెరికాలో సెటిల్ కావడం.. ఇలాంటి కలలతోనే ఎక్కువమంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాలనుంచి కూడా వస్తూంటారు. ఐటి కోచింగ్ సెంటర్లలో భారీగా విద్యార్థులతో అనునిత్యం అమీర్ పేట సందడిగా ఉండేది. కానీ ఆ రద్దీ క్రమంగా తగ్గుతోంది. ఐటి కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఏదైనా డిగ్రీ ఉంటె చాలు.. అమీర్ పేటలో ఐటి కోర్సు నేర్చుకునే వారి సంఖ్య గతంలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం ఐటి విభాగంలో డిగ్రీ లేదా పిజి చేసిన వారు మాత్రమే కోచింగ్ సెంటర్లలో దర్శనం ఇస్తున్నారు.

ఈ పరిస్థితికి కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేపడుతున్న ఇమిగ్రేషన్ చట్టాల ప్రభావమే. ఎవరు పడితే వారు అమెరికా వెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదు. అత్యంత నైపుణ్యం కలవారు మాత్రమే అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. దీనితో అమెరికాలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే విద్యార్థులు కూడా మానుకుని స్వదేశంలోనే జాబ్ ని వెతుక్కుంటున్నారు. దీనివలన కాంపిటీషన్ బాగా పెరిగి కొత్తగా వస్తున్న వారికి ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి. దీని ప్రభావంతో ఐటి ఉద్యోగమే చేయాలని అనుకుంటున్న విద్యార్థులు వారి ఆలోచనని విరమించుకుంటున్నారు. త్వరగా ఉద్యోగం వచ్చే ఇతర రంగాలపై దృష్టి పెడుతున్నారు.

జావా, డాట్ నెట్, ఒరాకిల్ వంటి కోర్సులని నేర్చుకునేందుకు గతంలో వేలాదిమందిగా విద్యార్థులు అమీర్ పేటకు చేరుకునేవారు. అక్కడ ఉంటుంది హాస్టల్స్ వారికి నీడనిచ్చేవి. ఇవి ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోచింగ్ సెంటర్లని నిర్వహించడం సాధ్యం కాదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఐటి ఉద్యోగాల కోసం పడిగాపులు కాచే కన్నా త్వరగా ఉద్యోగం వచ్చే కోర్సులు ఉత్తమం అని విద్యార్థులలో ఆలోచన మొదలైంది. కాగా నైపుణ్యం ఉన్న వారికి ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments