సమీక్ష : సుబ్రహ్మణ్యపురం

Friday, December 7th, 2018, 06:40:48 PM IST

ఆరంభంలో మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత కొంత కాలం హిట్లు లేక తడబడ్డ సుమంత్,గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన “మళ్ళీ రావా” చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని ఇప్పుడు అదే పంథాని కొనసాగించాలని వైవిధ్యమైన సినిమాలని అందించాలని “సుబ్రహ్మణ్యపురం” అనే సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ తోనే ఆసక్తి పెంచిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ఈ రోజే విడుదల అయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి.

కథ :

మొదటి నుంచే నాస్తికుడైన హీరో సుమంత్ దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు.అదే సందర్భంలో హీరోయిన్ ఈషా రెబ్బా వెంట తన ప్రేమ కొరకు సరదాగా వెంటపడుతూ తన సన్నిహితులతో ఆటపట్టిస్తుంటాడు.అయితే సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి.అసలు అవి ఎందుకు జరుగుతున్నాయి.అక్కడ
గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటి దాన్ని పది రోజుల్లో ఛేదిస్తానని చెప్పిన సుమంత్ దాన్ని ఛేదించడంలో విజయం సాధించాడా లేదా అన్నది వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్రం రానా వాయిస్ ఓవర్ తో టైటిల్స్ పడటంతోనే చిత్రంపై ఆసక్తిని రేపుతూ మొదలవుతుంది.ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న కథ కొత్తగా అనిపించినా ఇది వరకే వచ్చిన కార్తికేయ షేడ్స్ ఈ చిత్రంలో కనిపించినట్టుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు.హీరో సుమంత్ ఆ గ్రామంలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని చేధించే పాత్రలో తనదైన నటన కనబర్చారు.ఈషా రెబ్బ కూడా తన నటనతో ఆకట్టుకుంది.సాఫీగా సాగుతున్న ఫస్టాఫ్ లో కొన్ని ఊహించని సంఘటనల ద్వారా సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని కనబరుస్తాయి.

ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి కూడా ఇంకా ఆ ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.దీనితో అసలు ఏం జరుగుతుంది అన్న విషయం పై ప్రేక్షకుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉన్నా సరే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే బాగున్ను,అక్కడక్కడా వచ్చిన కామెడీ సన్నివేశాలు పర్వాలేదనిపించాయి.ఈ చిత్రంలో మిగతా నటులు వారి పాత్ర మేరకు నటించి పర్వాలేదనిపించారు.సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదనిపించినా బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్ :

సుమంత్ నటన,
ఆసక్తికరంగా సాగే ఫస్ట్ హాఫ్,
కథానుసారం సాగే ట్విస్టులు.

మైనస్ పాయింట్స్ :

ప్రొడక్షన్ విలువల్లో లోపం,
ఎడిటింగ్.

తీర్పు :

మొత్తానికి సినిమా దర్శకుడు తాను అనుకున్నది చిన్న చిన్న లోపాలతో అందించినా తీర్చిదిద్దిన తీరు మాత్రం బాగానే ఉంది అని చెప్పాలి.సుమంత్ తన ప్లాపుల కెరీర్ లోనుంచి తేరుకోవడానికి కష్టపడుతున్న తీరు మెచ్చుకోదగినదే, ఈ చిత్రంతో సుమంత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి.అయితే ఇది వరకే కార్తికేయ షేడ్స్ కూడా కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

Rating : 3.5/5

REVIEW OVERVIEW
Subramaniapuram Telugu Movie Review