ఫ్లాష్ న్యూస్ : సీఎం క్యాంపు ఆఫీస్ ముందు సూసైడ్ అటెంప్ట్

Wednesday, April 11th, 2018, 01:31:24 PM IST

మనం సాధారణంగా ఒక ఎమ్యెల్యే నో లేక ఒక ఎంపీ నో కలవాలంటే చాల ఫార్మాలిటీస్ ఉంటాయి. ముందుగానే అప్పోయింట్మెంట్ తీసుకోవాలి. అదికూడా చాలా రోజులు నుండి ప్రయత్నిస్తే కానీ దొరకక పోవచ్చు. మరి అటువంటిది ఒక వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే చాల తతంగమే ఉంటుంది. అయితే తనకు వచ్చిన కష్టాన్ని విన్నవించుకోవడానికి ముఖ్యమంత్రిని కలవాలని వచ్చి, ఆయన్ని కలిసే ప్రయత్నం ఫలించక ఆత్మహత్య యత్నం చేసాడు ఒక రైతు. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. నిజానికి ఒక పేద రైతు తనను కలుసుకోవటానికి తన ఇంటి ముందుకు వచ్చారన్న విషయం కేసీఆర్ కు సమాచారం చేరవేసే వాళ్లు ఎవరు అన్నది ప్రశ్న. గతంలో మాదిరి ముఖ్యమంత్రులు ప్రజాదర్బార్ ఏర్పాటు చేయటం ఒక క్రమపద్దతిలో ఉండేది.

కానీ, కేసీఆర్ హయాంలో అలాంటివి ఎప్పుడో ఒకసారి తప్పించి రెగ్యులర్ గా ఉండని పరిస్థితి అనే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం లోకి వెళితే, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పుష్పాలగూడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సైదులు 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న అతను వరి పంట వేశాడు. పంటకు నీరు లేకపోవటంతో పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాని పరిస్థితి. దీని కోసం చేసిన అప్పులు, వాటి వడ్డీలు కలిపి రూ.9లక్షలకు చేరుకున్నాయి. అంత పెద్ద మొత్తంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అతడు, తన ఆర్థిక కష్టాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళదామన్న ఉద్దేశంతో సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నాడు.

అక్కడ సీఎంను కలిసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతడు, తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగేసి అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఈ వైనాన్ని గుర్తించిన పోలీసులు 108 ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు రైతు పరిస్థితి నిలకడగా ఉందని, మరొక 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు. ఒక సాదాసీదా వ్యక్తి ఎవరైనా సరే తన కష్టాల్ని ముఖ్యమంత్రికి చెప్పుకోటానికి రాగానే, అతడ్ని పిలిచి సమస్యలు వినే పరిస్థితి సీఎంకు లేకపోవచ్చు. కానీ, అలాంటోళ్లకు, వారి నమ్మకం పెరిగేలా కష్టంలో ఉన్న వారికి సీఎం అపన్నహస్తం ఉంటుందన్న భావన వచ్చేలా ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు……