మండ్యలో గెలుపెవరిది..?: వారసత్వం ఓవైపు – సానుభూతి మరోవైపు…!

Friday, March 15th, 2019, 05:11:11 PM IST

కన్నడ నటుడు, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ భార్య సుమలత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మండ్య లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే, ఇదే స్థానానికి జేడీఎస్ అధినేత దేవెగౌడ వారసుడు కుమారస్వామి కొడుకు యువ హీరో నిఖిల్ గౌడ్ పోటీ చేస్తున్నారు. మూడోతరం నాయకుడిగా నిఖిల్ గౌడను గెలిపించుకొని జేడీఎస్ బలాన్ని పెంచుకోవాలని భావిస్తుండగా, సుమలత కూడా పట్టుదలగా ఉండటంతో జెడీఎస్, కాంగ్రెస్ లకు తలనొప్పిగా మారింది మండ్య నియోజకవర్గం.

ఓవైపు వారసత్వం, మరోవైపు సానుభూతి వెరసి కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి, సుమలత, నిఖిల్ గౌడ మధ్య పోరు కాస్తా సోషల్ మీడియాకు కూడా పాకింది. జేడీఎస్ కార్యకర్తలు, నిఖిల్ గౌడ అభిమానులు “మన జిల్లా, మన మండ్య” అంటూ స్థానికతను ఆసరాగా తీసుకొని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు, మరోవైపు అంబరీష్ అభిమానులు, అనుచరులు “గో బ్యాక్ నిఖిల్” అంటూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా సుమలతకు కన్నడ సినీ పరిశ్రమ కూడా మద్దతు పలుకుతోంది. దీంతో కన్నడ నాట లోక్ సభ ఎన్నిక రసవత్తరంగా మారనావుంది, మరీ మండ్యలో గెలుపు వారసత్వాన్ని నిలబెడుతుందో లేక సానుభూతి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.