ఐపీఎల్ 11 : సన్ రైజర్స్ పై విమర్శలు..79 కోట్లతో ఇలాంటి జట్టా..!!

Monday, January 29th, 2018, 05:36:35 PM IST

ఐపీఎల్ 11 సందడి షురూ అయింది. ఏప్రిల్ 4 నుంచి పొట్టి క్రికెట్ పండుగ మొదలు కానుంది. ఇటీవల ముగిసిన వేలంలో అన్ని ప్రాంఛైజీలు తమకు అవసరమైన ఆటగాళ్ళని కొనుగోలు చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 79 కోట్లు వెచ్చించి 25 మంది ఆటగాళ్ళని కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ జట్టుపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. ఇదేమి టి 20 జట్టు అని అభిమానులు పెదవి విరుస్తున్నారు. సన్ రైజర్స్ జట్టు బ్యాట్స్ మాన్ లపై ఆధారపడిన సందర్భాలు లేవు. సన్ రైజర్స్ విజయాల్లో ఎక్కువ పాత్ర బౌలర్లదే.

ఈ సారికూడా సన్ రైజర్స్ బౌలర్ల పైనే ఆధారపడుతోంది. జట్టు భీకరమైన బ్యాట్స్ మాన్ అయితే ఎవరూ లేరు. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ లే బ్యాటింగ్ కు వెన్నెముక. ఇక మనీష్ పాండే, యూసఫ్ పఠాన్ లు కూడా ఉన్నారు. కానీ యూసఫ్ పఠాన్ ఫామ్ పైనే అందరి అనుమానాలు. నిలకడ లేకపోవడం యూసఫ్ పఠాన్ ప్రధాన లోపం. ఇక మనీష్ పాండే ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది. న్యూజిలాండ్ ఆటగాడు విలియంసన్ కూడా సన్ రైజర్స్ జట్టులో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో మాత్రం సన్ రైజర్స్ జట్టు పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, షకిబుల్ హాసన్, ఆఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. బౌండరీల మోత మోగే ఐపీఎల్ టి 20 లలో బౌలర్లతో సన్ రైజర్స్ జట్టు ఏమేరకు నెగ్గుకొస్తుందో చూడాలి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (25): శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్, విలియమ్సన్, యూసఫ్ పఠాన్, షకిబుల్ హాసన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, బ్రాత్ వైట్, మనీష్ పాండే, మహమ్మద్ నబి, జోర్దాన్, స్టాన్ లేక్, వృద్ధిమాన్ సాహా, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ, సయ్యద్ ఖలీల్, శ్రీవత్సవ గోస్వామి, బాసిల్ థంపి, నటరాజన్, బిపుల్ శర్మ, సచిన్ బేబీ, మెహదీ హాసన్, రిక్కీ భాయ్, తన్మయ్ అగర్వాల్.