ట్రెండింగ్ న్యూస్ : సూపర్ స్టార్ రజిని సంచలన నిర్ణయం!

Saturday, February 24th, 2018, 03:22:34 AM IST


సూపర్ స్టార్ రజినికాంత్ ఏమి చేసినా అది సంచలనమే అని చెప్పక తప్పదు. ఇప్పటికే గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన తాను రాజకీయాల్లో కి వస్తున్నట్టు అభిమానుల సమక్షంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే విషయాలపై తమిళనాడు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా రజినీకాంత్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయన ప్రకటించింది కొత్త పార్టీ గురించి కాదు త్వరలో ప్రారంభం కానున్నకొత్త సినిమా డిటైల్స్ మాత్రమే.

రాజకీయ పార్టీ ప్రకటన అనంతరం ఆయన కాలా, 2.0 చిత్రాలతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో అనూహ్యంగా మరో సినిమా ప్రకటించి మరోమారు వార్తల్లో నిలిచారు. అయితే ఆయన ప్రస్తుతం అవకాశం ఇచ్చింది మాత్రం ఒక కుర్ర దర్శకుడికి. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ త్వరలో రజినీకాంత్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ రజినీకి నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఈ చిత్ర ప్రకటనను సన్ నెట్వర్క్ సంస్థ తమ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి వుంది….