కావేరి నది జలాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Saturday, February 17th, 2018, 02:00:19 AM IST

గత కొన్ని దశాబ్దాలుగా కావేరి నది జలాలపై చెలరేగుతోన్న వివాదల గురించి అందరికి తెలిసిందే. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ విషయంపై చాలా సార్లు వాగ్వివాదాలకు దిగాయి. ఎన్నో బంద్ లు అల్లర్లు జరిగాయి. అంతే కాకుండా ఏ ప్రముఖ వ్యక్తులు ఈ విషయంపై స్పందించినా కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. అయితే రీసెంట్ గా సుప్రీం కోర్టు ఎవరు ఊహించని విధంగా ఈ వివాదానికి ఒక పరిష్కారాన్ని అందించింది. 2007 ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం కోర్టు ఫైనల్ నిర్ణయాన్ని చెప్పడంతో గొడవలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రాల మధ్య కావేరి నది జలాల వివాదం ఎక్కువవుతోందని కేంద్రం కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌(సీడబ్ల్యూడీటీ)ని ఏర్పాటుచేసింది. అయితే 2007లో ట్రైబ్యునల్‌ ఎవరికీ ఎంత దక్కాలి అనే విషయంపై విచారణ జరిపి ఒక తీర్పు చెప్పింది. మొత్మగా 740 టీఎంసీలు అని తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు – 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు అని ఒక నివేదికలో తెలిపారు. దీంతో ఆ లెక్కల్లో మోసం ఉందని వ్యతిరేకిస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వారు ఎవరికీ వారు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

విచారణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పును ఇచ్చింది. 2007 ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం.. తమిళనాడుకు ఇక నుంచి 177.25 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయాలని కోర్టు కర్ణాటకను ఆదేశించింది. ఈ విధానం వల్ల కర్ణాటకకు ఎక్కువగా 14.75 టీఎంసీల నీరు మిగులుతుంది. అయితే కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు అందవలసిన వాటాల్లో ఎలాంటి మార్పు ఉండదని ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇక నుంచి నీటిని పంచుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.