మాజీ ముఖ్య మంత్రుల కొంపలు కొల్లేరయ్యాయిరోయ్.,

Monday, May 7th, 2018, 09:45:11 PM IST

ఉత్తర ప్రదేశ్ లోని యోగి సర్కార్ కు సుప్రీం కోర్టు తాజాగా షాకిచ్చింది. యూపీలో మాజీ ముఖ్యమంత్రులందరూ జీవితాంతం ప్రభుత్వ బంగ్లాల్లో నివాసం ఉండేలా యూపీ సర్కార్ 2016లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున అధికారిక బంగ్లాల్లో నివాసం ఉంటోన్న మాజీ ముఖ్యమంత్రులను వెంటనే ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రులకు ప్రభుత్వ బంగ్లాను కొనసాగిస్తూ యూపీ సర్కార్ చేసిన సవరణను సుప్రీం సోమవారం నాడు కొట్టివేసింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకపై యూపీలో మాజీ సీఎంలకు అధికారిక బంగ్లాలను కేటాయించకూడదు.

ఉత్తర్ ప్రదేశ్ లో మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయిస్తూ 2016లో అప్పటి సమాజ్ వాదీ పార్టీ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీని ప్రకారం యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్ – ములాయం సింగ్ యాదవ్ – మాయావతి – రాజ్ నాథ్ సింగ్ – కళ్యాణ్ సింగ్ – ఎన్ డీ తివారీలకు ప్రభుత్వ బంగ్లాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ జీఓ లోక్ ప్రహరి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులు చెల్లవని తీర్పునిచ్చింది. యూపీ సర్కార్ చట్ట సవరణ వివక్షతో కూడుకుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ సూత్రానికి ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. యూపీ మంత్రులకు సంబంధించిన సెక్షన్ 4(3) -2016(జీతభత్యాలు – ఇతరత్రా సౌకర్యాలు)రాజ్యాంగ విరుధ్దమని ప్రకటించింది.