కొత్త జిల్లాల కసరత్తు షురూ

Sunday, September 7th, 2014, 11:57:45 AM IST


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ మొత్తాన్ని 24 జిల్లాలుగా, మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా మారుస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో జిల్లాల పునర్విభజన అనేది పార్లమెంట్ స్థానాలను ఆధారంగానా, లేదా అసెంబ్లీ స్థానాలను పరిగణనలోకి తీసుకోవాలనే అనే అంశంపై స్పష్టత రాలేదు. పార్లమెంట్ స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే కేవలం రెండింటికీ మాత్రమే అవకాశముంటుంది. కానీ ప్రతి నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మూడు జిల్లాలు ఏర్పడుతాయి.

తెలంగాణ రాష్ట్రంలో భౌగోళికంగా అతిపెద్ద జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్‌ను 3 జిల్లాలుగా మారుస్తామని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా పలుమార్లు ప్రస్తావించారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా జిల్లాల పునర్విభజన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతమున్న మహబూబ్‌నగర్ జిల్లాకు అదనంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉన్న వనపర్తి, నాగర్‌కర్నూల్‌లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాలమూరు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కాస్త గందరగోళంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రాల తీరును ఇప్పటికే విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ జిల్లా కేంద్రంగా వనపర్తి ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటును గద్వాల కేంద్రంగా జరగాలని పట్టుబడుతున్నారు. మరోవైపు కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి కూడా జిల్లా కేంద్రాల ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని వనపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొత్త జిల్లాలు అంటే కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పార్లమెంట్ పరిధిని ఆధారంగా చేసుకొని చేయాలంటూ పట్టుబడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఏంటనేది గందరగోళంగా మారింది.