ఐటీ అధికారులొస్తున్నారు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!

Tuesday, October 2nd, 2018, 03:38:02 PM IST

సంద‌ట్లో స‌డేమియా అంటే ఇదే మ‌రి! ఓవైపు రేవంత్ రెడ్డి అక్ర‌మాస్తుల‌పై విచార‌ణ సాగిస్తున్నారు ఐటీ అధికారులు. ఆయ‌న ఇల్లు, కార్యాల‌యాలు స‌హా బంధువుల ఇళ్ల‌లో త‌నిఖీలు చేశారు. ఆ క్ర‌మంలోనే రేవంత్ చుట్టం ఇంట్లోనూ త‌నిఖీలు చేశార‌ని, అయితే ఆ త‌నిఖీలు చేసింది వేరే అధికారులు అంటూ బాంబ్ పేలే వార్త ఒక‌టి రివీలైంది.

మేమే ఐటీ అధికారులం అంటూ ర‌ణ‌ధీర్ రెడ్డి అనే ఆసామి ఇంట్లో నిన్న‌టిరోజున 15 మంది త‌నిఖీలు చేప‌ట్టార‌ట‌. భారీ మొత్తంలో డ‌బ్బు, బంగారు ఆభ‌ర‌ణాల్ని స‌ద‌రు ఐటీ అధికారులు ఎత్తుకెళ్లారు. క‌ట్ చేస్తే ఈ త‌నిఖీలు చేసింది మేం కాదంటూ అస‌లు ఐటీ అధికారులు చెప్ప‌డంతో ఖంగు తిన‌డం అత‌డి వంతైంది. దీనిపై ప్ర‌స్తుతం ఐటీ కార్యాలయంలో ర‌ణ‌ధీర్ త‌ర‌పు వ్య‌క్తి ఉదయ్ సింహా విచార‌ణ ఎదుర్కొన్నారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలపై మరి కొంత సమయం కావాలని కోరానని ఆయ‌న కోరార‌ట‌. అందుకు 3 వ తేదీ వరకు ఐటీ అధికారులు అత‌డికి గ‌డువిచ్చారు. ఇంత‌కీ ఆయ‌న ఇల్లు ఎక్క‌డ‌? అంటే.. చైతన్య పూరి పరిధిలో ఉంటున్న మా బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల మంటూ సోదాలు చేసారని ఉద‌య్ సింహా చెబుతున్నాడు.

ఈ సోదాల్లో బంగారం, నగదు,సెల్ ఫోన్లు తీసుకెళ్లారని తెలిపారు. ఇదే విష‌యం ఐటీ అధికారులను అడిగాన‌ని తెలిపారు. మేము నిన్న ఎలాంటి సోదాలు జరపలేదు అని ఐటీ అధికారులు చెప్పారన్నారు. దీనికి ప్రభుత్వం భాద్యత వహిస్తుందా, లేక ఐటీ అధికారులు భాద్యత వహిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇదంతా రాజకీయ కుట్ర లో భాగమేన‌ని ఉదయ్ సింహ ఆరోపిస్తున్నారు. అక్ష‌య్ కుమార్ `స్పెష‌ల్ ఛ‌బ్బీస్‌`ని ఇటీవ‌లే సూర్య తెలుగు, త‌మిళ్‌లో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాని త‌ల‌పిస్తోంది క‌దూ?