తాజ్ మహల్ మాదే.. మరి షాజహాన్ సంతకమేది?

Wednesday, April 11th, 2018, 09:43:43 PM IST

ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న తాజ్ మహల్ విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 20 వేల కూలీలు 20 ఏళ్లు కష్టపడి నిర్మించిన ఆ అద్బుతం ఎన్నటికీ చెదరకూడదని భారత ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంచింది. అయితే రీసెంట్ గా ఒక కమిటీ వాళ్లు వచ్చి తాజ్ మహల్ మా ఆస్తి అని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై గత కొంత కాలంగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. 2010 సున్నీ వక్ఫ్‌ బోర్డు సుప్రీం కోర్టులో తాజ్ మాహాల్ ను షాజహాన్ మాకు ఆస్తిగా రాసిచ్చాడని తెలిపింది.

అయితే ఆ పిటిషన్ పై ఇటీవల విచారించగా సున్నీ వక్ఫ్‌ బోర్డు కు అత్యున్నత న్యాయస్థానం దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చింది. షాజహాన్‌ అప్పట్లో తాజ్‌ మహల్‌ ను వక్ఫ్‌ బోర్డు ఆస్తిగా రాసిచ్చారని చెప్పారు. దీంతో సంతకాలు చూపించాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. షాజహాన్ మీకు ప్రకటించినట్టుగా ఒరిజినల్‌ డీడ్‌ చూపించండి అని ఆదేశించింది. అంతే కాకుండా తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది అంటే ఈ దేశంలో ఎవరు నమ్ముతారు? సుప్రీంకోర్టు సమయాన్ని ఈ విధంగా వృథా చేయకూడదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.