ఆ క్రికెటర్ బిడ్డ పేరు తాజ్ మహల్ ?

Friday, May 18th, 2018, 10:18:27 PM IST


ప్రపంచం లోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచే తాజ్ మహల్ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే అని అనాలి. ఆగ్రాలో కొలువైవున్న తాజ్ మహల్ ని చూడడానికి నిజానికి మన రెండు కళ్ళు చాలవనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ క్రితం 1632వ సంవత్సరం లో షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ కు గుర్తుగా ఆయన ఈ మహల్ నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణాంతరం చూపరులను ఎంతగానో ఆకర్షించిన ఈ అద్భుత మహల్ ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత వింతల్లో ఒకటిగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన మనసుకు దగ్గరగా, ప్రేమకి గుర్తుగా వుండే తాజ్ మహల్ పేరును తన కుమారుడికి పెట్టాలని ఒక క్రికెటర్ తెలిపాడు.

అతను మరెవరో కాదు దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్ మాన్ ఎబి డివిలియర్స్. ప్రస్తుతం రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు టీం తరపున ఆడుతూ తన ఆటతో భారతీయుల మనసుల్ని గెలుచుకున్న ఎబి కి ఇండియా అన్నా ఇక్కడి ఆచార వ్యవహారాలన్నా చాలా ఇష్టమట. ఇటీవల మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన భార్యతో ప్రారంభమైన ప్రేమ, ఆ తరువాత జరిగిన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నిజానికి తమ ప్రేమని ఇండియా లోనే వ్యక్తపరిచానని, ఒకసారి తన పెళ్ళికాకముందు ప్రేమకు చిహ్నమైన తాజ్ ను చూడడానికి వచ్చినపుడు భార్య డేనియల్ కు తన మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తూ,

నువ్వు నా జీవితంలోకి వస్తావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాదు తమ పెళ్లి తర్వాత కలగబోయే మూడవ సంతానానికి తాజ్ అనే పేరుకూడా పెట్టాలని ఎబి అదే సమయంలో నిర్ణయించాడట. కాగా ప్రస్తుతానికి ఎబి, డానియెల్ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఒక బిడ్డ 2015లో జన్మించగా, మరొక బిడ్డ 2017లో జన్మించాడు. తదుపరి జన్మించే మూడవ బిడ్డకు తాజ్ పేరు పెట్టడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయమని ఎబి అంటున్నాడు….

  •  
  •  
  •  
  •  

Comments