ఐపీఎల్ నిర్వహిస్తే స్టేడియంలోకి పాములను వదులుతాం

Tuesday, April 10th, 2018, 05:20:31 PM IST

తమిళనాడులో కావేరీ జలాల వివాదం రోజు రోజుకి తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. వెంటనే కావేరి నిర్వహణ మండలి ఏర్పాటుచేయాలని తమిళ నాడు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా వారి స్టైల్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ – కమల్ హాసన్ ఆదివరం జరిగిన నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం కోలీవుడ్ కష్టపడుతుందని అవసరమైతే ఐపీఎల్ మ్యాచ్ లను చెన్నై లో అడ్డుకుంటామని హెచ్చరించారు.

అదే తరహాలో పీఎంకే నేత వేల్‌మురుగన్‌ కూడా బిసిసిఐ కి హెచ్చరిక జారీ చేశాడు. ఈ రోజు కోల్ కత్తా తో చెన్నై సొంత గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ ఆడబోతోన్న సంగతి తెలిసిందే. అయితే కావేరి నది జలాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఐపీఎల్ ను చెన్నై లో అడ్డుకుంటామని చెప్పారు. ఒకవేళ తమ నిర్ణయానికి విరుద్ధంగా నిర్వహిస్తే.. స్టేడియంలోకి పాములను వదులుతామని వేల్‌మురుగన్‌ కామెంట్ చేయడం వివాదస్పదంగా మారింది. దీంతో ఈ రోజు ఎనిమిది గంటలకు స్టార్ట్ కానున్న మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.