‘నారావారి సారా’ పధకం పెడతారా?

Tuesday, September 30th, 2014, 10:00:57 PM IST


ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం హైదరాబాద్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని ‘మద్యాంధ్రప్రదేశ్’ చెయ్యాలని ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు ఆదేశాలిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. అలాగే ఎన్నికల హామీలలో బెల్టు షాపులను తొలగిస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మరింత తాగండని ప్రోత్సహిస్తోందని తమ్మినేని విరుచుకుపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆర్ధిక లోటు పూడ్చుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చెయ్యడం ఏమిటని నిలదీశారు. అలాగే ఆరు లక్షల ఫించన్లను కోత విధించడం దారుణమని, చేతకానప్పుడు, చేవ లేనప్పుడు ఎందుకు హామీలిచ్చారని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఇక నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే హామీలకు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే ‘నారావారి సారా స్రవంతి’, ‘మన ఊరు-మన సారా సేవించండి’ వంటి పధకాలు పెడతారేమోనని అనిపిస్తోందని తమ్మినేని సీతారం ఎద్దేవా చేశారు.