అసెంబ్లీకి అమృత.. ఇది సమయమా మిస్టర్ కమ్యూనిస్ట్ !

Wednesday, September 19th, 2018, 12:50:29 PM IST

నల్గొండ మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య ఉదంతం తీవ్ర సంచలనాలు రేపిన సంగతి తెలిసిందే. కుల వివక్ష కారణంగా జరిగిన ఈ పరువు హత్యను ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ప్రణయ్ భార్య అమృతకు ధైర్యం చెబుతుండగా రాజకీయ నాయకులు మాత్రం ఒకడుగు ముందుకేసి ఉదంతానికి పొలిటికల్ పౌడర్ అద్దుతున్నారు.

ఇప్పటికే పలు పార్టీల సీనియర్ నేతలు ప్రణయ్ ఇంటికి వెళ్లి అమృతకు, ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడ అమృతను ఓదార్చడానికి అక్కడికి వెళ్లారు. ఓదార్పు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అమృతకు ఓదార్పును మాటల్లో మాత్రమే కాదు చేతల్లో కూడ చూపించాలని, ఆమెను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని మిర్యాలగూఢ ప్రజలకి విజ్ఞప్తి చేసి షాక్ ఇచ్చారు.

అమృత చాలా ప్రోగ్రెస్సివ్ గా ఉందని, ఇప్పుడు కాకపోయినా ఇంకో పది రోజుల తరవాత అయినా ఆలోచించుకుని ఆమె తన నిర్ణయాన్ని చెప్పాలని, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వివక్షపై పోరాటానికి మద్దతుగా మిర్యాలగూఢలో తన అభ్యర్థులను నిలబెట్టవద్దని, అమృతను ఏకగ్రీవంగా చట్టసభకు పంపాలని, అందరూ ఒప్పుకుంటే తమ భాద్యతగా తమ అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని పోటీ నుండి విరమింపజేస్తామని ఊగిపోతూ అన్నారు.

అసందర్భమైన ఈ మాటలు వింటుంటే మిస్టర్ కమ్యూనిస్టు గారికి ఈ దుర్ఘటనను రాజకీయం చేసి మిర్యాలగూఢ రాజకీయాల్లో ఎలాంటిదైనా సరే ఒక పెను మార్పును తీసుకురావాలనే ఆలోచ బలంగా ఉన్నట్టు భోధపడుతోంది.