‘ఎన్టీఆర్, బాలయ్యల కలయిక’.. బ్రేక్ చేసే పాలిటిక్స్ వద్దు !

Sunday, October 21st, 2018, 03:49:54 PM IST

జూ.ఎన్టీఆర్ ను బాలయ్య దగ్గరకు తీసుకుంటే చూడాలని నందమూరి అభిమానులు, మరోసారి టీడీపీ కార్యకలాపాల్లో హరిక్రిష్ణకు సముచిత స్థానం లభిస్తే బాగుంటుందనేది టీడీపీ కార్యకర్తలు ఎన్నాళ్ళ నుండో కోరుకుంటున్నారు. హరిక్రిష్ణ అకాల మరణంతో ఆ కోరికల్లో ఒకటి తీరే అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ విషాదం తారక్, కళ్యాణ్ రామ్ లను బాలయ్యకు, టీడీపీకి దగ్గరయ్యే పరిస్థితుల్ని క్రియేట్ చేసింది.

అన్న మరణంతో బాలయ్య తారక్, కళ్యాణ్ రామ్ లకు దగ్గరయ్యారు. చెప్పాలంటే ఒక పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈరోజు జరగబోయే ‘అరవింద సమేత’ విజయోత్సవ వేడుకకు కూడ హాజరుకానున్నారాయన. ఈ పరిణామంతో టీడీపీ వర్గాలు ఇక తారక్, కళ్యాణ్ రామ్ లు టీడీపీకి దగ్గరైనట్టేనని, ఇకపై పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నారు. కొందరైతే బాలయ్యతో పాటే వీరిద్దరిని కూడ తెలంగాణలో ప్రచారానికి పంపాలని బాబు యోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఇప్పుడిదే ఎన్టీఆర్ అభిమానుల్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో పార్టీ కోసం ప్రచారానికి దిగిన తారక్ కు ఆ తరవాత ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ రాజకీయ పరిణామాలు బాలయ్య, హరిక్రిష్ణ కుటుంబాల మధ్య చాలా దూరాన్ని పెంచాయి. అందుకే బాలయ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను దగ్గరచేసుకోవడం వరకు బాగున్నా వారిని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటే చాలని, కుటుంబ వ్యవహారాల వరకు అందరూ ఒక్కటిగా ఉంటే బాగుంటుందని, బంధాల్ని బ్రేక్ చేసే ఈ పాలిటిక్స్ అవసరంలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.