టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. మ‌రీ ఇంత దారుణ‌మా..?

Monday, November 12th, 2018, 08:48:58 PM IST

టాలీవుడ్‌లో అనూహ్యంగా దూసుకువ‌చ్చిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ టాక్సీవాలాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అర్జున్ రెడ్డి, గీత‌గోవిదం లాంటి వరుస హిట్స్ త‌ర్వాత వ‌చ్చిన నోటా చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ క్ర‌మంలో టాక్సీవాలా రిజ‌ల్ట్ విజయ్ దేవ‌ర‌కొండ‌కి చాలా ముఖ్యంగా మారింది. ఈ నేప‌ధ్యంలో తాజాగా టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు.

అయితే ఈ వేడుక‌లో భాగంగా టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ సినిమా విశేషాలు గురించి నాలుగు మాట‌లు చెప్పుదామ‌ని స్టేజ్ మీద‌కు వ‌చ్చ‌న ప్రియాంక మైక్ ప‌ట్ట‌కుని మాట్లాడ‌డం మొద‌లు పెట్ట‌గానే విజ‌య్ ఫ్యాన్స్ గ‌ట్టిగా గోల చేస్తూ, అరుస్తూ.. విజిల్స్ వేస్తూ.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. దీంతో భ‌య‌ప‌డిన ప్రియాంక వ‌ణికిపోయింది. అయితే వెంట‌నే తేరుకొని మాట్లాడ‌దామ‌ని ప్ర‌య‌త్నించ‌గా.. విజ‌య్ రౌడీ ఫ్యాన్స్ మ‌రోసారి పెద్ద ఎత్తున అర‌వ‌డంతో ఈ క్యూట్ భామ బిక్క‌మొహంతో స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. దీంతో అక్క‌డ బ‌న్నీ, విజ‌య్‌లు ఉన్నా ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయ‌క‌పోవ‌డంతో సినీ జ‌నాలు విమ‌ర్శిస్తున్నారు. ఒక హీరోయిన్ తాను న‌టించిన సినిమా గురించి మాట్లాడుతుంటే ఆమెని దారుణంగా భయపెట్టి.. స్టేజ్ దిగి వెళ్ళిపోయేలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని స‌ర్వ‌త్రా అభిప్రాయ‌ప‌డుతున్నారు.