పొమ్మనలేక పొగ.. ట్రబుల్ షూటర్ కి చంద్రబాబు సిగ్నల్స్..!!

Thursday, February 1st, 2018, 04:36:42 PM IST

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేదు. అటు ప్రజల్లోని రాజకీయ వర్గాల్లోనూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన సెగలు మొదలయ్యాయి. మిత్రపక్షంగా ఉంటున్న టీడీపీ ఎంపీలే బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా చీఫ్ సెక్రటరీ తో సమావేశమై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధానికి పైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక బిజెపితో కొనసాగి లాభం లేదనే అభిప్రాయానికి బాబు వచ్చేశారట.

ఈ విషయమై టీడీపీ మంత్రులందరినీ అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ట్రబుల్ షూటర్ గా భావించే సుజనా చౌదరికి చంద్రబాబు సందేశం పంపారట. బిజెపి వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలని అవసరమైతే రాజీనామాకు సైతం సిద్ధపడాలని సుజనా చౌదరికి వ్యూహాన్ని వివరించినట్లు తెలుస్తోంది. అందుకే బడ్జెట్ పై సుజన చౌదరి కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఏపీకి నిధుల కేటాయింపులో తీవ్ర నిరాశకు గురిచేశారని, కేంద్రంపై ఒత్తిడి పెంచి అయినా సరే ఏపీకి రావలసిన వాటిని సాధిస్తాం అని సుజనా అన్నారు. టీడీపీ – బీజేపీ మధ్య నెలకొన్న పరిస్థితులు తాజ బడ్జెట్ ద్వారా మరింత క్రిటికల్ గా మారాయని చెప్పొచ్చు.