ఏపీలో టిడిపికి-బిజెపికి చెడిందా ?

Monday, January 29th, 2018, 10:20:52 AM IST

రాజకీయపార్టీలు ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తుపెట్టుకుంటారో, ఎప్పుడు ఎవరితో ఎలావుంటారనేది ఆ సమయంలో ఆయా పరిస్థితులని బట్టి ఉంటుంది. అదే విధంగా గత ఎలక్షన్లలో బిజెపి తో పొత్తు పెట్టుకున్న అధికార టిడిపి ప్రస్తుతం ఆ పార్టీ పై కాస్త గుర్రుగా వున్నట్లే చెపుతున్నారు. బిజెపి నేతలు టిడిపి పై చేస్తున్న విమర్శలని లైట్ గా తీసుకోవాలని అవి పెద్దగా పట్టించుకోనవసరం లేదని, ప్రతి విమర్శలు చేయొద్దని పార్టీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదం చిన్నదే అయినా లోలోపల దవాలం లా వ్యాప్తి చెందుతోంది. బిజెపి ఎమ్యల్యే విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజుల విమర్శలదాడితో టిడిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కొంత విసుగుచెందారేమో, మొన్న దావోస్ పర్యటన ముంగించుకు వచ్చిన బాబు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు చంద్రబాబు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తమ ప్రభుత్వానికి మిత్ర పక్షమైన బిజెపి పలు విధాలుగా అభివృద్ధిలో సాయపడుతుందని, నిజానికి అప్పట్లో మాతో మైత్రిని బిజెపి నేతలే కోరుకున్నారని అందుకే అన్నివిధాలా ఆలోచించి వారితో పొత్తు పెట్టుకుని ముందుకి సాగటం జరిగిందని, వారు తమతో తెగతెంపులకు సిద్ధపడితే మేము కూడా ఒక పెద్ద నమస్కారం పెట్టి తప్పుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మావాళ్లను అన్ని విధాలా కంట్రోల్ చేస్తున్నానని, ఇంతకంటే తానేమి మాట్లాడలేనన్నారు. ఆ ఇద్దరు నేతలు చేస్తున్న విమర్శలపై బిజెపి అధిష్ఠానం ఆలోచించుకోవాలి అన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులకు పాలపడ్డ ఎమ్యెల్యే లకు మంత్రిపదవులు ఇవ్వడం సరైంది కాదని, లేకపోతే అలా ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్యెల్యే లకు కూడా మంత్రిపదవులు ఇవ్వొచ్చు అనే ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావాలని విష్ణుకుమార్ రాజు , రాష్ట్రంలో బిజెపి ని నామరూపాల్లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, కేంద్రం ఇచ్చిన నిధులు ఇక్కడ సరిగ్గా ఖర్చు చేయడంలేదని సోము వీర్రాజు చేస్తున్న ఆరోపణలు తెలిసినవే. అయితే ఈ ఘటన పై బిజెపి అధిష్ఠానం ఇప్పటివరకు నోరు మెదపక పోవడం కొసమెరుపు.