సర్వ శక్తులు ఒడ్డుతున్న టీడీపీ – ఫ్యాన్లు తీసేయండంటూ కంప్లైంట్..!

Thursday, March 14th, 2019, 07:16:05 PM IST

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుక్షణం నుండి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది, ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో టీడీపీ ఎన్నికల కమీషన్ కు ఒక వింత కంప్లైంట్ ఇచ్చింది, వైసీపీ ఎన్నికల గుర్తయిన ఫ్యాన్ ను ప్రభుత్వ కార్యాలయాల నుండి తీసేయాలంటూ ఎన్నికల కమీషన్ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎన్నికల గుర్తయిన ఫ్యాన్ ను తక్షణమే ప్రభుత్వ కార్యాలయాల నుండి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరారు.

ఎన్నికల కోడ్ లో భాగంగా, విగ్రహాలను కప్పివేయటంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను కూడా తొలగించారు అధికారులు. ఇందుకు ప్రతిగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లను కూడా తొలగించాలంటూ ఫిర్యాదు చేసారు స్థానిక టీడీపీ నాయకులు, ఫ్యాన్ వైసీపీ గుర్తని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు సీలింగ్ ఫ్యాన్లను చూసి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ నాయకుడు జయశంకర్ నేతృత్వంలోని కార్యకర్తల బృందం రామకుప్పం మండల తాసీల్ధార్ కు ఫిర్యాదు చేయగా, ఆయన ఫిర్యాదును పరిశీలించి తక్షణమే తగిన చర్య తీసుకోవాలని జిల్లా ఎన్నిక అధికారులను కోరారు.