తెలంగాణ‌లో టీడీపీకి కాలం చెల్లుతోంది!

Thursday, January 10th, 2019, 10:35:08 AM IST

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని గులాబీ ద‌ళ‌ప‌తి స‌మూలంగా మార్చాల‌నే కంక‌ణం క‌ట్టుకున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు అద్దంప‌డుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను చిత్తుచేస్తూ స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌లేపిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి ఫ‌లితాల ద్వారా కాంగ్రెస్‌కు, టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఊహించ‌ని విధంగా అత్య‌ధిక స్థానాల్ని సొంతం చేసుకుని మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ ఖ‌మ్మం విష‌యంలో మాత్రం చాలా అసంతృప్టికి గుర‌య్యారు. అక్క‌డ పోటీ చేసిన ప‌ది స్థానాల‌కు గానూ తెరాస ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది.

ఈ విష‌యంపై ఖ‌మ్మం నేత‌ల‌పై గుర్రుగా వున్న ఆయ‌న అక్క‌డి సీనియ‌ర్ నేత‌ల‌పై సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. కూట‌మి త‌రుపున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, అశ్వారావు పేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వ‌ర‌రావుల‌ను తెరాస‌లోకి తీసుకొచ్చే విష‌యంలో ఖ‌మ్మం సీనియ‌ర్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అప్పుడే మంత్రాంగం మొద‌లుపెట్టారు. ఆ ఇద్ద‌రిని తెరాస‌లోకి తీసుకుని ఖ‌మ్మంలో ప‌ట్టు నిల్పుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఇద్ద‌రి నేత‌ల్లో అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు టీడీపీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఖ‌మ్మం ఎమ్మెల్యే సండ్ర వెంక‌టవీర‌య్య ఓటుకు నోటు కేసులో ఎక్యూస్డ్‌గా వున్నారు. తెరాస ప‌ట్టు బిగిస్తే త‌ల‌వంచి చిత్తం అన‌క త‌ప్ప‌దు. ఇదే జ‌రిగితే తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ అయిన‌ట్టే.

ఈ నేప‌థ్యంలో అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు ర‌హ‌స్యంగా తెరాస నేత తుమ్మ‌ల‌తో స‌మావేశం కావ‌డం ఖ‌మ్మం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే తెరాస తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే మీడియా కంట‌ప‌డిన ఆయ‌న మాత్రం తుమ్మ‌ల ఆరోగ్యం మంద‌గించిన కార‌ణంగా ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి మాత్ర‌మే వ‌చ్చానంటూ బుకాయించ‌డం కొస‌మెరుపు.