చంద్రబాబుకు చూపు మందగించినట్టుంది !

Monday, October 8th, 2018, 03:37:41 PM IST

ఎవరికైనా చూపు మందగిస్తే నడిచే దూరం కనపడదు.. కానీ ప్రభుత్వానికే చూపు మందగిస్తే, ఆ ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రిగారి విజనే దూరాన్ని చూడలేకపోతే.. ఇంకేముంది పాలన యంత్రాగానికి దూరంగా ఉన్న పల్లె వాసులు, గిరిజన ప్రాంత ప్రజల బ్రతుకు గాలిలో పెట్టిన దీపాలవుతాయి. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి కనబడుతోంది.

పట్టించుకునే నాధుడు లేక, ఓట్లడిగిన నేతలు కనబడక మన్యం ప్రాంత గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. వృద్దులకు అనారోగ్యం చేసినా, పిల్లలు పాము కాట్లకు గురైనా, గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పులతో భాధపడుతున్నా, చివరికి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఎవరైనా మరణించినా రాకపోకల కోసం కనీస ప్రయాణ సౌకర్యాలైన రోడ్లు, అంబులెన్సులు, మార్చురీ వ్యాన్లు , 108 ఎమర్జెన్సీ సదుపాయాలు లేక గిరి పుత్రులు నరకం అనుభవిస్తున్నారు.

తాజాగా పాడేరు మండలం గొండిపల్లి గ్రామానికి చెందిన కిల్లో దుర్గ పురిటినొప్పులతో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఐదు కిలోమీటర్ల దూరంలో గల జీకే వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డోలీ మోతతో తీసుకెళ్ళారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో లెక్కే లేదు. ఈ దుస్థితి అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా బాబుగారికి కనబడలేదు. ఏనాడూ వాళ్ళ గురించి టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అదేమంటే అక్కడి ప్రజలకు అర్థంకాని రీతిలో ఏవేవో లెక్కలు, పథకాల పేర్లు చెబుతూ పబ్బం గడుపుతున్నారు స్థానిక నేతలు. ఎప్పటికి ఈ ప్రభుత్వం కళ్ళకున్న బూజును దులుపుకుని వీరి కష్టాలను చూడగలుగుతారో.