టీడీపీకి ఫెస్టివ‌ల్ షాక్.. జ‌న‌సేన‌లో చేరిన చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి..!

Thursday, October 18th, 2018, 02:15:02 PM IST

ఏపీలో సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ.. అధికార టీడీపీ, ప్ర‌థాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో వ‌ల‌స‌లు పెరుతాయ‌ని అనుకుంటే.. జ‌న‌సేన‌లో జాయినింగ్‌లు ఎక్కువ అయ్యాయి. ఇటీవ‌ల ఉమ్మ‌డి ఏపీ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిక‌తో ఫుల్ జోష్‌లో ఉంది జ‌న‌సేన‌. దీంతో చాలామంది అసంతృప్త నేతలు జ‌న‌సేన వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీడీపీ మాజీ చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి.. ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌మ‌క్షంలో జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు.

ఇక చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున తిరుప‌తి నుండి అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే ఈ విష‌యాన్ని టీడీపీ ముఖ్య‌నేత‌ల‌తో కొద్ది రోజుల క్రితం చెప్పాడ‌ని తెలుస్తోంది. దీంతో టీడీపీ ముఖ్య‌నేత‌లు ఆ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా.. ఆయ‌న నుండి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. దీంతో చంద్ర‌బాబు త‌న‌ని లైట్ తీసుకున్నాడ‌ని భావించిన కృష్ణ‌మూర్తి కొద్ది రోజులుగా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ స‌మ‌క్షంలో కృష్ణ‌మూర్తి జ‌న‌సేన‌లో చేర‌డంతో ఆప్ర‌చారం నిజ‌మైందని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.