జగన్ మంచి అందగాడు..పొగిడేసిన టిడిపి మంత్రి..!

Monday, January 30th, 2017, 02:44:01 PM IST

jagan
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష పార్టీ వైసిపి కి, అధికార టిడిపి కి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.టిడిపి నేతలు వరుసగా ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నారు.సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న టిడిపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీలో పెట్టుబడులు రాకుండా జగన్ కుట్రపన్నాడని ఆరోపించారు.చంద్రబాబు, లోకేష్, రాజధానిఅంశాలపై జగన్ పదేపదే విమర్శలు చేయడాన్ని దేవినేని ఖండించారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే జగన్ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారని దేవినేని ఫైర్ అయ్యారు. జగన్ అందగాడని, ఇంగ్లిష్ బాగా మాట్లాడతాడని వీటితోపాటు అహంకారం కూడా ఉందని దేవినేని ఎద్దేవా చేసారు.

జైలుకు వెళ్ళివచ్చినా జగన్ లో ఇంకా మార్పురాలేదని అన్నారు. 11 సీబీఐ కేసుల్లో ఏ 1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమని దేవినేని అన్నారు. జగన్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవర్తించిన తీరుని రాష్ట్రప్రజలంతా గమనించారని ఆయన అన్నారు. మరోవైపు జగన్ కూడా చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు డబ్బాలు కొట్టుకోవడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. తాను విజయవాడలోనే ఉంటాను, ఇక్కడి నుంచే విమానం ఎక్కుతాను అంటూ సొంతడబ్బా కొట్టుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.