భయం అవసరం లేదు..పవన్ కళ్యాణ్ అలాగే ఉంటారు..!

Sunday, October 22nd, 2017, 03:32:56 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి ? తదుపరి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న జనసేనాని ఏం చేయబోతున్నారు ? ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారా లేక ఒంటరిగా పోటీ చేస్తారా ? ఈ ప్రశ్నలు అత్యంత ఆసక్తికరమైనవి మాత్రమే కాదు.. ఈ ప్రశ్నల సమాధానాలకు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పవన్ తీసుకోబోయే నిర్ణయంపైనే 2019 ఎన్నికల సరళి ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికి నిర్మాణ దశలోనే జనసేన పార్టీ ఉంది. దీనితో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి నోరు మెదపడం లేదు.

టిడిపి, బిజెపి లకు దూరం జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు అంచనా వేస్తుంటే, పవన్ కళ్యాణ్ – టీడీపీల మధ్య ఇప్పటికి రహస్య స్నేహం కొనసాగుతోందని అంటున్నారు. ఇక మునుముందు ఈ అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. కాగా టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఈ విషయాలపై మాట్లాడారు. 2019 లో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లరని తమతోనే ఉంటారని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భయాలు అవసరం లేదని కూడా రామానుజయ తెలిపారు. టిడిపి నేతలతో పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. కాపు నేతల మద్దత్తు పవన్ కళ్యాణ్ కు ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపికి పవన్ కళ్యాణ్ కు దూరం పెరిగిన నేపథ్యంలో జనసేనతో కలసి పోటీ చేయడానికి వామ పక్షాలు సిద్ధంగా ఉన్నాయి.