వైసీపీ నేత‌ల‌కు టీడీపీ నేత స‌వాల్ : న‌డిరోడ్డు మీద న‌న్ను కాల్చండి..!

Friday, March 15th, 2019, 09:20:40 PM IST

పులివెందుల‌లో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య టీడీపీ – వైసీపీ మ‌ధ్య కొత్త యుద్ధం రాజేసింది. హ‌త్య‌కు కార‌ణాలు తెలియ‌కున్నా కుట్ర కోణాలపై రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఇది టీడీపీ కుట్ర అని వైసీపీ నేత‌లు అంటుంటే, కాదు.. కాదు వైసీపీ అంత‌ర్గ‌త విభేదాల వ‌ల్లే అని తెలుగు త‌మ్ముళ్లు వాదిస్తున్నారు. ఈ హ‌త్య‌పై ఏపీ స‌ర్కార్ సిట్‌ను ఏర్పాటు చేస్తే, సిట్‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని, సీబీఐ ద‌ర్యాప్తు కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణుల డిమాండ్‌కు స్పందించిన టీడీపీ నేత‌లు.. ఏపీ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేకుంటే తెలంగాణ పోలీసుల ద‌ర్యాప్తును కోర‌వ‌చ్చంటూ టీడీపీ నేత‌లు సూచిస్తున్నారు.

అయితే, వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక సీఎం చంద్ర‌బాబు, రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, ఆది నారాయ‌ణ‌రెడ్డిల హ‌స్తం ఉందంటూ వైసీపీ నేత‌లు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం రాజ‌కీయ సెగ‌లు ర‌గిల్చింది.

దీంతో టీడీపీ కూడా రివ‌ర్స్ అటాక్ చేసింది. క‌డ‌ప ఎంపీ టికెట్ విష‌యంలో వివేకానంద‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌న్న వాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చింది. వైఎస్ ఫ్యామిలీలో కుటుంబ విభేదాలు ఉంటే.. అందులోకి త‌మ‌నెందుకు లాగుతార‌ని టీడీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత స‌తీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉన్న విభేదాల కార‌ణంగా ఇది జ‌రిగింద‌ని ప్ర‌జ‌లంద‌రూ అనుకుంటున్నార‌ని, కానీ వైసీపీ నేత‌లు టీడీపీపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం సిగ్గుమాలిన చ‌ర్య అని అన్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో టీడీపీ ప్ర‌మేయం ఉంద‌ని నిరూపిత‌మైతే న‌డిరోడ్డుపై త‌న‌ను పెట్టి కాల్చండి అంటూ టీడీపీ నేత స‌తీష్‌రెడ్డి స‌వాల్ చేశారు.