తెలంగాణలో ప‌చ్చ‌ త‌మ్ముళ్లు వైట్‌వాష్‌!?

Sunday, September 23rd, 2018, 12:14:00 PM IST

తెలంగాణలో ముంద‌స్తు ర‌ణ‌భేరి మోగిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ఓ ప‌క్క రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్వం సిద్ధం చేసే ప‌నిలో చ‌క‌చ‌కా అడుగులు వేస్తోంది. ముంద‌స్తుకు ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అధికార ప‌క్షం భీక‌ర‌ ప్యూహంతో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తుంటే ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం గెలుపు కోసం నానా హైరానా ప‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని క‌మిటీల‌పై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక టీటీడీపీ సంగ‌తి స‌రేస‌రి. తెలంగాణ‌లో ఈ పార్టీలోని నాయ‌కులంతా ఒక్క‌రొక్క‌రుగా అధికార టీఆర్ ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవ‌డంతో ఆ పార్టీలో ఎప్పుడూ లైమ్ లైట్‌లో క‌నిపించ‌ని ర‌మ‌ణ‌, పెద్దిరెడ్డి వంటి నాయ‌కులు త‌ప్ప ఎవ‌రూ మిగ‌ల‌లేదు.

తెలంగాణ జిల్లాల్లో టీటీడీపీ సంగ‌తి ఎంత బ‌లంగా వుంద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మిన‌హాయిస్తే ఆ పార్టీకి జిల్లాల్లో చెప్ప‌కోద‌గ్గ నాయ‌క గ‌ణం కానీ…చెప్పుకోద‌గ్గ క్యాడ‌ర్ కానీ లేదు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ప్ర‌భావంతో తెలంగాణ జిల్లాల్లో టీటీడీపీ తుడిచిపెట్టుకు పోయింద‌ని చెప్పొచ్చు. దీంతో టీటీడీపీ ప‌చ్చ‌ త‌మ్ముళ్ళు సిటీనే న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. న‌గ‌రంలోని కూక‌ట్ ప‌ల్లి, మ‌ల్కాజ్‌గిరి, శేరిలింగంప‌ల్లి, ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సెటిల‌ర్స్ ప్ర‌భావం ఎక్కువ‌. దీన్ని అడ్వాంటేజీగా తీసుకుని ఈ నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేయాల‌ని తెలుగు త‌మ్ముళ్లు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వున్న స‌మ‌యంలోనూ ఈ నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థులే అధిక శాతం విజ‌యం సాధించారు. అందుకే టీడీపీకి పెద్ద‌గా ప‌ట్టులేని తెలంగాణ జిల్లాల్లో పోటీకి దిగి డిపాజిట్ పోగొట్టుకునే కంటే ప‌ట్టున్న కూక‌ట్ ప‌ల్లి, మ‌ల్కాజ్‌గిరి, శేరిలింగంప‌ల్లి, ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వున్న సెటిల‌ర్ల‌ స‌హాయంతో చ‌క్రం తిప్పి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. ప‌చ్చ త‌మ్ముళ్ల ఈ క‌ల‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అన్న‌ది వేచి చూడాల్సిందే.