నెల్లూరు పాలిటిక్స్ : చ‌ంద్ర‌బాబుకు డ‌బుల్ స్ట్రోక్.. టీడీపీ నుండి ఇద్ద‌రు కీల‌క‌ నేత‌లు అవుట్..?

Monday, February 11th, 2019, 12:03:06 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఒక‌వైపు అభ్య‌ర్ధుల ఎంపిక మ‌రోవైపు తెర‌పైకి వ‌స్తున్న జాతీయ స‌ర్వేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళ‌కు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. నెల్లూరు జిల్లా అర్బ‌న్ టిక్కెట్ ఇప్ప‌టికే మంత్రి నారాయ‌ణ‌కు ఖారారు అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆశావ‌హుల క‌న్న‌ నెల్లూరు రూర‌ల్ పై ప‌డింది. అయితే చంద్ర‌బాబు మాత్రం ఆదాల ప్ర‌భాక‌ర్‌కు టిక్కెట్ ఖ‌రారు చేయ‌డంతో తీవ్రంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు ఇద్ద‌రు టీడీపీ నేత‌లు. వారిలో ఒక‌రు అబ్దుల్ అజీజ్ కాగా, మ‌రొక‌రు ఆనం జ‌య‌కుమార్ రెడ్డి. ఈ ఇద్ద‌రు నేత‌లు నెల్లూరు రూర‌ల్ టిక్కెట్ త‌మ‌కే వ‌స్తుంద‌ని భావించారు.

అయితే ఇప్పుడు ఆదాల ప్ర‌భాక‌ర్‌కు టిక్కెట్ ఓకే అవ‌డంతో, చంద్ర‌బాబు పై తీవ్రంగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అబ్దుల్ అజీజ్ ఏకంగా బాబు పై బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు దిగారు. టీడీపీలో మైనారిటీల‌కు స్థానం లేద‌ని, త‌మ‌కు చంద్ర‌బాబు అన్యాయం చేస్తున్నార‌ని క‌ల‌క్ట‌రేట్ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేప‌ధ్యంలో అబ్దుల్ అజీజ్ టీడీపీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక మ‌రోవైపు ఆనం జ‌య‌కుమార్ రెడ్డిది కూడా అదే ప‌రిస్థితి. టీడీపీని న‌మ్ముకుందుకు త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని, త్వ‌ర‌లోనే త‌గిన బుద్ధి చెబుతాన‌ని అంటున్నారు జ‌య‌కుమార్. ప్ర‌స్తుతం ఆనం రాంనారాయ‌ణ రెడ్డి వైసీపీలో ఉన్న నేప‌ధ్యంలో జ‌య‌కుమార్ కూడా ఆ పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని నెల్లూరు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబుకు డ‌బుల్ స్ట్రోక్ త‌ప్పేలా లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.