ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు!

Sunday, May 27th, 2018, 01:47:25 PM IST

తెలుగు దేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు నేడు ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో ఎంతో వైభవంగా ప్రారంభమయింది. విజయవాడ నగరం మొదలుకొని కానూరు వెళ్లే ప్రాంతమంతా పసుపు తోరణాలతో, పచ్చ రంగు జెండాలతో కళకళలాడుతోంది. మహానాడులో తొలుత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జండా ఎగురవేసి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తదనంతరం డ్వాక్రా మహిళల ఫోటో బజార్, రక్తదాన శిబిరాలను ప్రారంభించి రక్త దానం చేసిన వారిని అభినందించారు. విజయవాడ, కానూరు రోడ్డులోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని మైదానంలో ఈ మహానాడు వేదికను సిద్ధం చేశారు. దాదాపు 400 మంది వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేసారు. అలానే మహానాడు ప్రాంగణంలోకి అడుగుపెట్టే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, దాహార్తిని తీర్చేందుకు నిరంతర మంచినీటి సదుపాయం కల్పించారు.

ఈ ఎన్నికల ముగింపుకు ఇది ఆఖరి మహానాడు కావడంతో కేంద్ర వైఖరిని ఎండగట్టే విధంగా దీనిని టీడీపీ శ్రేణులు ఆయుధంగా చేసుకుంటున్నాయి. వచ్చే సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టవలసిన, అలానే రానున్న ఎన్నికలకు చేపట్టవలసిన ప్రణాళికలపై ఈ మహానాడులో నిర్ణయాలు తీసుకోనున్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ప్రజలు వేలాదిగా తరలి వస్తారని, తదనుగుణంగా ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సక్రమమైన రీతిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిడిపి నేతలు, కార్యకర్తలు చెపుతున్నారు. ఈ మహానాడులో మొత్తం 36 తీర్మానాలు చేయనున్నారు. ముఖ్యంగా క్షీణిస్తున్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, కేంద్రం వారు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, అలానే ఆర్ధిక ప్రగతిని దెబ్బతీసేలా కేంద్రం 15వ ఆర్ధిక సంఘానికి టర్మ్ అఫ్ రెఫరెన్సు ఇవ్వడం వంటి అంశాలపై నిరసనను తెలియచేయనున్నారు.

ఇక ముఖ్యంగా నాలుగు ఉమ్మడి తీర్మానాలుగా ఎన్టీఆర్ కు ఘన నివాళి, కేంద్ర రాష్ట్రారాజకీయాల్లో టీడీపీ పాత్ర, ఏపీకి 20, తెలంగాణకు 8 తీర్మానాలు చేయనున్నారు. ఇక ఈ సభకు వేలాదిగా విచ్చేసే ప్రజలకు ఉదయం పూత 25వేలమందికి అల్పాహారం, రెండుపూటలా దాదాపు 40వేల మందికి 20 రకాల వంటకాలతో కూడిన భోజన ఏర్పాట్లు. అలానే అతిధులకు, విఐపిలకు ప్రత్యేక భోజన వసతులు ఏర్పాట్లు చేసారు. కూర్చుని ఒకేసారి రెండువేల మంది భోజనం చేసేవిధంగా, అలానే కొందరు బఫె సిస్టం లో తినే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇది విజయవాడలో ఏర్పాటు చేసిన 4వ మహానాడు అని, ఇదివరకు 1983, 1988, 2000 లో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన మహానాడులు ఎంతో విజయవంతం అయ్యాయని ఇది కూడా పెద్ద విజయవంతం అవుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మహానాడు మొత్తం మూడు రోజలపాటు జరగనుంది….

  •  
  •  
  •  
  •  

Comments