ఏపీ బ్రేకింగ్..టీడీపీ ఎమ్మెల్యే బిగ్ స్కామ్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?

Tuesday, January 29th, 2019, 01:30:14 PM IST

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌వేళ అధికార తెలుగు దేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల నుంద‌ని తెలుస్తోంది. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్రలో కాంట్రాక్టుల సందర్బంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఇది వరకే మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలో నిర్మించిన వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి బొల్లినేని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.

బొల్లినేని రామారావుకి చెందిన నిర్మాణ సంస్థ మహారాష్ట్రలో పలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేసింది. విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో పలు పనులకు సంబంధించి 35 కాంట్రాక్టులను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. ఈ పనుల్లోనే కొందరు అధికారులతో కుమ్మక్కు అయ్యి అడ్డగోలుగా అంచనా పెంచి ఏకంగా 20వేల కోట్ల రూపాయల దోపిడికి పాల్పడినట్టు మహారాష్ట్ర ఏసీబీ నిర్ధారించింది. దీంతో గ‌తంలో ఈ విష‌యం పై బొల్లినేని రామారావు అరెస్ట్‌కు మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నించినా హైకోర్టు అరెస్ట్ పై స్టే ఇచ్చింది. అయితే తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయడంతో బొల్లినేని రామారావు అరెస్ట్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం. దీంతో ఏ క్షణంలోనైనా టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ తప్పదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో ఎన్నిక‌ల వేళ టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.